బెంగాల్ గడ్డ మీది నుంచి కేంద్ర హోంమంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సవాల్ విసిరారు. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని తదుపరి ముఖ్యమంత్రి చేయాలని శత ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ… బెంగాల్ లో తదుపరి వచ్చేది తమ బీజేపీ ప్రభుత్వమేనని అమిత్ షా బల్లగుద్ది చెప్పారు. దీనికి ట్రైలర్ 2024 లో కనిపిస్తుందని ప్రకటించారు. అమిత్ షా ప్రస్తుతం బెంగాల్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బీర్భూమ్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 35 స్థానాల్లో బీజేపీని గెలిపించాలని కోరారు.
35 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే, 2025లో జరిగే శాసన సభ ఎన్నికల్లో మమత బెనర్జీ ప్రభుత్వం కుప్పకూలుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే, శ్రీరామ నవమి శోభాయాత్రలపై దాడి చేసే ధైర్యం ఎవరికీ ఉండదని అమిత్ షా హామీ ఇచ్చారు. బెంగాల్‌లో రామనవమి ఊరేగింపులను నిర్వహించలేరా? వారిపై దాడి చేస్తారా?” అని ప్రశ్నించారు. దీదీ బుజ్జగింపు వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. బెంగాల్‌ను ఉగ్రదాడి నుంచి విముక్తి చేయాలంటే బీజేపీ ఒక్కటే మార్గమన్నారు. బెంగాల్‌లో చొరబాట్లను అరికట్టాలంటే 2024లో తమకు 35 సీట్లు ఇవ్వండని అమిత్ షా కోరారు.