ఇన్ని రోజుల పాటు ఓటు బ్యాంకు రాజకీయాలతోనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం జరపలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలూ భయపడ్డాయని, ఏ ప్రభుత్వమూ సాహసించలేదన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విమోచన దినోత్సం జరిగింది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. నిజాం, రజాకార్ల ఆగడాలకు ఆపరేషన్ పోలో ద్వారా పటేల్ ముగింపు పలికారని, ఈ పోరాటంలో ఎందరో ప్రాణాలు అర్పించారని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ రాష్ట్రానికి, కర్నాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్ 17 న స్వాతత్రం వచ్చిందన్నారు.

 

హైదరాబాద్ స్వాతంత్రం కోసం ఎంతో మంది బలిదానాలు చేశారని, సర్దార్ పటేల్ లేకపోతే తెలంగాణ విమోచనం మరింత ఆలస్యమయ్యేదన్నారు. సర్దార్ పోలీస్ యాక్షన్ ద్వారానే విమోచనమైందని పేర్కొన్నారు. 108 గంటల పాటు జరిగిన పోలీసు చర్యలో ఎంతో మంది అమరులయ్యారని పేర్కొన్నారు. నిజాం రాజ్యంలో అరాచకాలను ఇప్పటికీ మరిచిపోలేమని, ఇంకా కొంత మంది మనుషుల్లో రజాకార్లు సజీవంగానే వున్నారని విమర్శలు చేశారు. ఎవరి త్యాగాల వల్ల నేడు అధికారంలో వున్నారో వారికి శ్రద్ధాంజలి కూడా ఘటించకపోతే… తెలంగాణకు ద్రోహం చేసిన వారవుతారని టీఆర్ఎస్ పై మండిపడ్డారు.