కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల జమ్మూ కశ్మీర్ పర్యటన ప్రారంభమైంది. జమ్మూ కశ్మీర్ చేరుకున్న అమిత్ షా కు ఎల్జీ మనోజ్ సిన్హా, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో తొలిసారిగా షా వైష్ణోదేవీ ఆలయాన్ని అమిత్ షా దర్శించుకున్నారు. హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత షా వైష్ణో దేవికి రావడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా షా పలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాజౌరీలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. గుజ్జర్లు, బకర్వాల్ తో పాటు పహారీ సామాజిక వర్గాలకు ఎస్టీ తెగ కింద రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అతి త్వరలోనే వీటిని అమలు చేస్తామని అన్నారు.
కోటా విషయంలో ఏర్పాటు చేసిన జస్టిస్ శర్మ కమిషన్ సిఫార్సుల మేరకే ఈ నిర్ణయమని స్పష్టం చేశారు. 2019 లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అణగారిన వర్గాల వారికి రిజర్వేషన్లు అందించేందుకు మార్గం మరింత సుగుమమైందన్నారు. గతంలో జమ్మూ కశ్మీర్ ను 3 కుటుంబాలు మాత్రమే పాలించేవని ధ్వజమెత్తారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన 30 వేల మంది చేతిలో అధికారం వుందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కశ్మీర్ లో విద్యార్థులకు స్కాలర్ షిపులు పెంచామని, 100కుపైగా కొత్త స్కూళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. హైవేల కోసం లక్ష కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఇవన్నీ ఆర్టికల్ 370 రద్దు తర్వాతే జరిగాయన్నారు.
మరోవైపు జమ్మూ పర్యటనలో భాగంగా అమిత్ షా జమ్మూలోని కన్వనెన్షన్ సెంటర్ లో పలు డెవలప్ మెంట్ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అంతేకాకుండా వివిధ ప్రాజెక్టులకు శంకు స్థాపన చేయనున్నారు. దీని తర్వాత జమ్మూ కశ్మీర్ లోని శాంతిభద్రతలపై అమిత్ షా సమీక్ష జరుపుతారు. ఆ తర్వాత బారాముల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు.