తెలంగాణ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం సాధించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీకి, ఏవీఎన్ రెడ్డికి అభినందనలు తెలుపుతూ అమిత్ షా ట్వీట్ చేశారు. చారిత్రాత్మక విజయం సాధించిన ఏవీఎన్ రెడ్డికి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. తెలంగాణలోని అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోయారనడానికి ఇదో నిదర్శనమని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలోని పారదర్శకమైన బీజేపీ పాలనను కోరుకుంటున్నారని ఈ విజయంతో తెలుస్తోందని అమిత్ షా ట్వీట్ చేశారు.

 

తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవీన్ రెడ్డి గెలుపొందారు. హైదరాబాద్‌‌‌‌–రంగారెడ్డి- – మహబూబ్‌‌నగర్‌‌- టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమీప పీఆర్టీయూ అభ్యర్థి గుర్రం చెన్నకేశవ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి ఘన విజయం సాధించారు. సుమారు 1,150 ఓట్ల తేడాతో ఏవీఎన్ రెడ్డి గెలుపొందారు. గురువారం అర్ధరాత్రి 2 గంటల వరకూ ఓట్ల లెక్కింపు జరిగింది.

 

హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తైంది. దీంతో ఏ అభ్యర్థికీ సరైన మెజారిటీ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలైంది. మూడో స్థానంలో ఉన్న యూటీఎఫ్‌ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డికి వచ్చిన 6,079 ఓట్లను రెండో ప్రాధాన్యత ఆధారంగా మొదటి రెండు స్థానాల్లోని అభ్యర్థులకు సర్దుబాటు చేయడంతో ఏవీఎన్‌ రెడ్డి విజయం ఖరారైంది.