అదానీ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఇందులో దాచాల్సింది ఏమీ లేదని తేల్చి చెప్పారు. అలాగే తాము భయపడాల్సిన అవసరం కూడా లేదన్నారు. అయితే… అదానీ విషయం ప్రస్తుతం సుప్రీం కోర్టులో వుందని, ఓ బాధ్యతాయుత మంత్రిగా దీనిపై వ్యాఖ్యానించకూడదని అన్నారు. ఓ జాతీయ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా పై వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అదానీ విషయం సుప్రీం పరిధిలో వుంది. అందుకే ఓ బాధ్యతాయుత మంత్రిగా వ్యాఖ్యానించకూడదు. అయితే… ఇందులో దాచాల్సింది ఏమీ లేదు. భయపడాల్సిన పని అంతకంటే లేదు అని వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల్లో తమకు ఎవరూ పోటీలోనే లేరన్నారు. దేశం మొత్తం ప్రధాని మోదీ వెంటే వుందని ప్రకటించారు.
కొన్ని రోజులుగా అదానీ విషయం ఉభయ సభలనూ కుదిపేస్తోంది. అదానీ వ్యవహారంపై ప్రధాని మోదీ జవాబివ్వాలంటూ ప్రతిపక్షాలన్నీ ఉభయ సభల్లో రోజూ నిరసన వ్యక్తం చేస్తూనే వచ్చాయి. వెల్ లోకి దూసుకెళ్లి, అదానీ వ్యవహారంపై చర్చించాల్సిందేనని పట్టుబట్టాయి. ఇదే విషయంలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోక్‍సభలో ఫొటోలు చూపిస్తూ మోడీ, అదానీ మధ్య బంధం ఎప్పటి నుంచో కొనసాగుతోందని అన్నారు. మోడీ మద్దతుతోనే అదానీ ఎదిగారని ఆరోపించారు.
మరో వైపు అదానీ -హిండెన్‌బర్గ్ వ్యవహారంపై కమిటీ వేసేందుకు కేంద్రం అంగీకరించింది. అదానీ వివాదంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఇన్వెస్టర్ల భద్రత కోసం కమిటీ వేసేందుకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే… కమిటీలో ఎవరెవరు వుండాలన్నది తమకు పేర్లను పంపాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.