జగన్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో నెం.1 పై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం సాగుతూనే వుంది. తాజాగా దీనిపై మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. ఎట్ట పరిస్థితుల్లోనూ జీవో 1 ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రజా శ్రేయస్సును తీసుకొనే ఈ జీవోను తెచ్చామన్నారు. ఈ జీవో అన్ని పార్టీలకూ వర్తిస్తుందని పునరుద్ఘాటించారు. చంద్రబాబు రోడ్ షోలతో ఏపీ ప్రజలకు ఒరిగిందేమీ లేదని, చంద్రబాబు కాలు పెట్టిన చోట జనం పిట్టల్లా రాలిపోతున్నారని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఓ బాధ్యతతోనే జీవోనెం.1 ని తీసుకొచ్చిందని, దీనిపై చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ, చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని, కుప్పంలో జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను కూడా చంద్రబాబు గెలిపించుకోలేక పోయారని ఎద్దేవా చేశారు. కుప్పం ప్రజలు సీఎం జగన్ ను ఆదరిస్తున్నారని, కుప్పాన్ని రెవిన్యూ డివిజన్ చేసింది జగన్ అని మంత్రి అంబటి గుర్తు చేశారు.












