సెకెండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమైన సీనియర్ నటులు అంబాళం పార్థసారథి

సినిమాల్లో ఏ పాత్రకైనా సరిపోయే ముఖ రూపం ఆయనది. నటుడిగా 250కి పైగా సినిమాలు, 40 సీరియల్స్‌లో అలరించారు. నటనే కాకుండా ఆధ్యాత్మికత కూడా ఆయనలోని మరో కోణం. ఆయన ఈమధ్యనే ఎవరూ తలపెట్టని శ్రీ శివసహస్రనామ స్తోత్రము (చన్ద్రికాభాష్యము) అన్న 1120 పేజీల ఉద్గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథాలని అనేకమంది ఉద్దండులైన పండితులు ప్రశంసించారు. ఆయనే అంబాళం పార్థసారథి. కరోనా మహమ్మారి తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న పార్థసారధి.. ఇప్పుడు తన సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నో చిత్రాల్లో, ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసిన ఆయన.. తన అనుభవాన్ని నేటితరం దర్శకులకు అందించేందుకు సంసిద్ధులయ్యారు. యువతరంతో కలిసి పని చేయడం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

పార్థసారథి సినీ ప్రస్థానంలోని కొన్ని విశేషాలు ఆయన మాటల్లోనే…

నేను పోలీస్ శాఖలో పనిచేస్తూనే వీలు కుదిరినప్పుడల్లా సినిమాల్లో నటించేవాణ్ణి. 1980లో కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన ‘శివుడు శివుడు శివుడు’ సినిమా నా మొదటి సినిమా. మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి తొలిసారి నటించా. నా ఫస్ట్ కాంబినేషన్ చిరంజీవి గారు, రావుగోపాలరావు గారు, అల్లు రామలింగయ్య గారు, గొల్లపూడి మారుతీరావు గారు, జగ్గయ్య గారు. తొలి సినిమాకే మహామహులతో కలిసి పనిచేయడం నా అదృష్టం.

తెలుగులో 250 సినిమాలు..
ఇప్పటి వరకు తెలుగులో 250 సినిమాలు చేశా. అలాగే 40కిపైగా సీరియళ్లలో నటించా. తెలుగులో ఒక్క ఎన్టీఆర్ గారితో తప్ప మిగతా మహామహులందరితోనూ నటించా. అలాగే అమితాబ్ బచ్చన్, రాజేశ్ ఖన్నా, సంజీవ్ కుమార్, కమల్‌హాసన్, విక్రమ్, అర్జున్ వంటి స్టార్లతో కూడా కలిసి పనిచేశా.

బాహుబలి ఛాన్స్ అలా మిస్సయ్యా!
దర్శకధీరుడు రాజమౌళి గారు నాకు సీరియల్స్ చేసేటప్పటి నుంచి తెలుసు. ఆయన తొలి రెండు సినిమాల్లోనూ యాక్ట్ చేశా. ‘బాహుబలి’ టైమ్‌లో రాజమౌళి గారు నాకు ఫోన్ చేశారు. అయితే అప్పుడు నేను ముంబైలో నివాసం ఉన్నా. దాంతో ప్రపంచ ఖ్యాతి పొందిన ఆ సినిమాలో అవకాశం మిస్ అయ్యా.

మహాభారతంతో పాటు సంస్కృతంలో వార్తలు
మహాభారతంలోని శివ సహస్రనామాల్లో ఒక్కో నామాన్ని తీసుకుని ఒక్కోదానిపై రెండు పేజీల వరకు రాస్తున్నా. అనేక పురాణాలు, వేదాలు, ఉపనిషత్తుల్లోని కొత్త కొత్త విషయాలను సేకరించి గత ఏడాది నుంచి శివ సహస్రనామాలు రాస్తున్నా. నాలుగేళ్ల నుంచి రోజూ తెల్లవారుజామున 2.30 గంటలకు నిద్రలేచి 4 గంటలలోపు రామాయణ, భారత, భాగవతాంర్గత విషయాలను నా ఫేస్‌బుక్‌, వాట్సాప్ ద్వారా పాఠకులకు అందిస్తున్నా. అది చూసి ‘డివోషనల్ ట్రీ’ యూట్యూబ్ చానెల్ వాళ్లు ప్రవచనాలు చెప్పమని అడిగారు. షూటింగులు కూడా లేకపోవడంతో నేనూ ఓకే అన్నాను. మహాభారతం అనుశాసన పర్వం, వాల్మీకి రామాయణం ఉత్తరకాండ, విష్ణుశర్మ విరచిత పంచతంత్రమ్ ప్రవచనాలను చెబుతున్నా. అలాగే ‘థర్డ్ ఐ వెబ్’ చానెల్‌లో సంస్కృతంలో వార్తలు చెబుతున్నా. అప్పట్లో సీనియర్ నటుడు కొంగర జగ్గయ్య గారు తెలుగులో వార్తలు చెప్పేవారు. ఇప్పుడు నేను సంస్కృతంలో చెబుతున్నా. జగ్గయ్య గారిత తర్వాత సినిమా నటుల్లో వార్తలు చెప్పేది నేనేనని ధీమాగా చెప్పగలను.

మెగాస్టార్ నిజంగా ఆదర్శపురుషుడు
మెగాస్టార్ చిరంజీవి గారితో నా తొలి సినిమా చేశా. ‘శివుడు శివుడు శివుడు’ సినిమాలో ఆయన కలిసి నటించిన జ్ఞాపకాలు మరచిపోలేనివి. అహోరాత్రులు కష్టపడి స్వయం కృషితో పైకి వచ్చిన వ్యక్తి. చిరంజీవి గారు నిజంగా ఆదర్శ పురుషుడు. అలాంటి గొప్ప వ్యక్తి మన ఇండస్ట్రీలో ఉండడం గర్వకారణం. చిరంజీవి గారితో మొత్తం 8 సినిమాలు చేశా. ప్రస్తుతం చిరంజీవి గారు వరుస సినిమాలు చేస్తున్నారు. ఆయన తదుపరి సినిమాల్లో అవకాశం వస్తే ఆయనతో కలిసి ఎక్కువ సినిమల్లో నటించే అదృష్టం కలుగుతుందని అనుకుంటున్నా.

ఎన్టీఆర్ గారితో నటించకపోయినా.. బాలకృష్ణ గారితో నటించా
తెలుగు చలన చిత్ర పరిశ్రమ గుర్తుంచుకునే నటుడు నందమూరి తారకరామారావుగారితో కలిసి నటించకపోయాననే ఒక బాధ ఉండేది. అయితే ఆయన కుమారుడు తీసిన ఎన్టీఆర్ జీవిత చిత్రం ‘ఎన్టీఆర్- మహానాయకుడు’లో ఆయనతో కలిసి నటించడం అన్నగారితో నటించినట్లేనని భావిస్తా. ఎందుకంటే అందులో బాలకృష్ణగారు ఎన్టీయార్ వేషంలో ఉన్నారు కదా. బాలకృష్ణగారితో అంతకు ముందే ఐదారు సినిమాలు చేశా. తాజాగా ‘మహానాయకుడు’లో అసెంబ్లీ స్పీకర్‌గా చేశా. అందులోనూ ఓ గొప్ప విషయం ఉంది. హైదరాబాద్‌లోని ఏపీ అసెంబ్లీ(ఇప్పుడు మూతపడింది)లో ఒరిజినల్‌‌గా స్పీకర్ కూర్చున్న స్థానంలోనే నన్ను కూర్చోబెట్టారు. ఆ సీట్లో కోడెల శివప్రసాద్ రావు గారి తర్వాత నేనే కూర్చున్నా అని చెప్పొచ్చు. బాలకృష్ణ గారు చాలా మంచి వ్యక్తి. ఆయనకు జోతిష్యం వచ్చు. సంస్కృతం తెలుసు. ఆయనకు కోపం అంటారు కానీ.. అది క్షణకాలమే.

మంచి పాత్రల కోసం..
ఇప్పటి వరకు 250 సినిమాలు చేసినా ఇంకా మంచి పాత్రలు చేయాలన్న ఆసక్తి ఉంది. నా ఫేస్ ఏ క్యారెక్టర్‌కైనా సరిపోతుందని బాపు, రమణ గార్లు నన్ను మెచ్చుకోవడం నాకు కలిసొచ్చే అంశం. వారు అన్నట్లుగానే ఇప్పటి వరకు ఎన్నో రకాల పాత్రలు చేశాను. పౌరాణిక పాత్రల నుంచి రాజకీయ నాయకుల పాత్రల వరకు అన్నీ చేశాను. కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ సినిమాలో నటించా. ఆయన చాలా మంచి దర్శకుడు. ఇటీవల విడుదలైన ‘భగవంత్ కేసరి’ సినిమాలో అనిల్ రావిపూడిగారు కూడా నాకు అవకాశం ఇచ్చారు. ప్రస్తుత దర్శకులు చాలామంది మంచి కథలతో ముందుకొస్తున్నారు. నాకోసం ఏవైనా మంచి పాత్రలు సృష్టిస్తే నేను తప్పకుండా నటిస్తా. తెలుగులో ప్రస్తుతం ఉద్దండులైన దర్శకులు ఎందరో ఉన్నారు. వాళ్లందరితోనూ పని చేయాలన్నది నా ప్రగాఢమైన కోరిక.

అంబాళం పార్థసారథి గారికి మీ సినిమాలో అవకాశం ఇవ్వాలనుకున్న వారు +91 93910 09372 నంబర్ ద్వారా నేరుగా ఆయననే సంప్రదించగలరు.

Related Posts

Latest News Updates