మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఇటీవల భగత్సింగ్ కోశ్యారీ ప్రకటించిన నేపథ్యంలో ఆ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్న బీఎస్ కొశ్యారీ ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకోగా.. తన శేషజీవితాన్ని పుస్తకాలు చదువుతూ, రచిస్తూ గడపాలనుకుంటున్నానని ఆయన ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో మహారాష్ట్ర నూతన గవర్నర్గా పంజాబ్ మాజీ సీఎం, బిజెపి నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ ను నియమించాలని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సుదీర్ఘ కాలంపాటు కాంగ్రెస్లో కొనసాగిన అమరీందర్ సింగ్, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ను వీడి పంజాబ్ లోక్ కాంగ్రెస్ అనే కొత్త పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో అమరీందర్ సింగ్ తో పాటుగా ఆయన పార్టీ కూడా ఘోరంగా ఓడిపోయింది. అనంతరం బిజెపిలో చేరిన ఆయన తన పార్టీని కూడా బీజేపీలో వీలినం చేశారు.