బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై వైసీపీ నేతలు దాడి చేశారు. అమరావతి ఉద్ధండరాయుని పాలెం వద్ద ఈ ఘటన జరిగింది. అమరావతి ఉద్యమం 1200 రోజుకు చేరిన సందర్భంగా వారికి సంఘీభావం ప్రకటించింది, విజయవాడకి తిరిగి వెళ్తుండగా… సత్య కుమార్ పై వైసీపీ నేతలు దాడి చేశారు. వాహనాలకు అడ్డంగా నిలబడి, మూడు రాజధానులకు అనుగుణంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా సత్య కుమార్ ప్రయాణిస్తున్న వాహనంపై వైసీపీ నేతలు రాళ్లదాడి చేశారు. దీంతో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో బీజేపీ నేతలు వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాళ్లు రువ్విన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేశారు.
ఇక… ఈ దాడిపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ స్పందించారు. పధకం ప్రకారమే తనపై దాడి చేశారని బీజేపీ నేత సత్యకుమార్ ఆరోపించారు. తన కారును పోలీసులే ఆపారని.. ఎందుకు ఆపారని అడిగే లోపే తన వాహనంపై వైసీపీ గూండాలు దాడి చేశారని సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కారుపై రాళ్ల దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని, దాడిపై డీఎస్పీ సమాధానం చెప్పాలని బీజేపీ నేత సత్యకుమార్ డిమాండ్ చేశారు.
జగన్‌రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ఏపీలో వైసీపీ అరాచకానికి అడ్టుకట్ట వేస్తామని సత్యకుమార్ హెచ్చరించారు. తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదన్నారు. తాడేపల్లి నుంచి వచ్చిన డైరెక్షన్స్ మేరకు, పథకం ప్రకారమే ఎంపీ నందిగం సురేష్ అనుచరులు దాడికి దిగారని ఆరోపించారు.
బీజేపీ నేత సత్యకుమార్ వాహనంపై దాడిని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఖండించారు. అమరావతి ఉద్యమానికి మద్దతు పలికేందుకు వచ్చిన సత్యకుమార్ కారుపై వైసీపీ గూండాల దాడిని ఖండిస్తున్నామని చంద్రబాబు అన్నారు. కారుపై దాడిని పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు?, పక్కా ప్రణాళికతోనే వైసీపీ గూండాలు దాడి చేశారని చంద్రబాబు ఆరోపించారు.