హీరోయిన్ అనుమప పరమేశ్వరన్ పై నిర్మాత అల్లు అరవింద్ తెగ ప్రశంసలు కురిపించారు. తనకే ఓ కూతురు వుంటే అచ్చు అనుపమలా వుండాలని మెచ్చుకున్నారు. అనుపమ నటన చాలా సహజంగా వుంటుందని, అందుకే ఆమె అంటే తనకు అమితమైన ప్రేమ అని వివరించారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న తాజా చిత్రం 18 పేజిస్. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి తెరకెక్కిస్తున్నారు. బన్నీ వాసు నిర్మిస్తుండగా…. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో వస్తోంది. సుకుమార్ కథను అందిస్తున్నారు. ఈ నెల 23 న విడుదల కాబోతోంది.

అయితే… సినిమాలోని ఏడురంగుల వాన అనే పాటను యూనిట్ విడుదల చేసింది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటను నిర్మాత అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగానే అల్లు అరవింద్ నటి అనుపమను తెగ మెచ్చుకున్నారు. మనసులో ఏది వుంటుందో అదే బయటకు కనిపిస్తుందని, అనుపమ లాంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారని అన్నారు. ఇక… చిత్రం యూనిట్ కి అల్లు అరవింద్ కంగ్రాట్స్ తెలిపారు.












