ఢిల్లీలో ‘ఇండియన్ ఆఫ్ ద ఇయర్ 2022’ అవార్డు అందుకున్నఅల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్.. ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఒక వైపు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే మరోవైపు అవార్డుల ఫంక్షన్లలో బన్నీ మెరుస్తున్నారు. ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు వరుస అవార్డులు కొల్లగొడుతూ తన ఇమేజ్‌ను మరింత పెంచుకుంటున్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ అవార్డుల ఫంక్షన్‌లో పాల్గొన్న బన్నీ.. భారత దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌ను కలిశారు. పుష్ప రాజ్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను ఇప్పటి వరకు కనిపించనంత డీగ్లామర్ రోల్‌లో చూపిస్తూ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన సినిమా ‘పుష్ప: ది రైజ్’.  సుకుమార్ తనకెంతో ఇష్టమైన బన్నీని దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు మెచ్చే విధంగా చాలా పక్కాగా చూపించారు. ‘పుష్ప’తో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన బన్నీ.. తాజాగా ఢిల్లీలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో ఎంటర్‌టైన్మెంట్ క్యాటగిరీ నుంచి ‘ఇండియన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అందుకున్న బన్నీ.. ఈ కార్యక్రమంలోనే భారత దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌ను కలిశారు. తన దగ్గరకు వచ్చి రెండు చేతులూ జోడించి నమస్కారం పెట్టిన బన్నీని కపిల్ దేవ్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. బన్నీతో కాసేపు ముచ్చటించారు. ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే, అల్లు అర్జున్ ఈ ఏడాది అన్ని మేజర్ ఎంటర్‌టైన్మెంట్ అవార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. న్యూ యార్క్‌లో జరిగిన వార్షిక ఇండియన్ డే పరేడ్‌లో గ్రాండ్ మార్షల్‌గా భారత్‌కు ప్రాతినిథ్యం వహించడం దగ్గర నుంచి ‘పుష్ప’ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా సైమా(SIIMA)లో అవార్డు, సౌత్ బెస్ట్ యాక్టర్‌గా ఫిల్మ్‌వేర్ అవార్డును సొంతం చేసుకోవడం వరకు ఐకాన్ స్టార్ హవా కొనసాగింది. ఇప్పుడు ఎంటర్‌టైన్మెంట్ కేటగిరీలో ‘ఇండియన్ ఆఫ్ ద ఇయర్ 2022’ అవార్డును అందుకోవడం ద్వారా అల్లు అర్జున్ ఇమేజ్ మరింత పెరిగింది.

Related Posts

Latest News Updates