దిగ్గజ హాస్యనటుడు అల్లు రామలింగయ్య 45 ఏళ్ల వయసులో ఉన్న తనను తండ్రి లాగి కొట్టిన సందర్భం గురించి తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో అల్లు అరవింద్ పంచుకున్నారు. ఈ దెబ్బకు కారణమైన అంశం గురించి కూడా వివరించారు. ఈ ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ తన వ్యక్తిగత విషయాలు చాలానే పంచుకున్నారు. ఈ షో చాలా సరదాగా సాగింది.45 ఏళ్ల వయసులో ఉన్న తనను తన తండ్రి అల్లు రామలింగయ్య ఒకానొక సందర్భంలో లాగికొట్టారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గుర్తుచేసుకున్నారు. ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అరవింద్.. తన జీవితంలోని మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. వాటిలో చాలా వరకు తండ్రి అల్లు రామలింగయ్యతో ముడిపడి ఉన్నవే. ‘నాన్న గారికి కోపం వస్తుందా?’ అని ఆలీ అడిగిన ప్రశ్నకు అల్లు అరవింద్ స్పందిస్తూ.. ‘‘ఆయన చాలా సీరియస్ మనిషండి. జోవియల్‌గా అలా ఉండరు. ఆయన హాస్యాన్ని తెర మీద పంచుతారు కానీ.. మాకు మాత్రం సీరియస్‌నెస్సే పంచారు’’ అని అన్నారు. ‘‘పెద్దయిన తరవాత, పిల్లలు పుట్టిన తరవాత కూడా మీకు సన్మానం జరిగిందని విన్నాను. అది ఏ సందర్భంలో సార్’’ అని ఆలీ అడగగానే అల్లు అరవింద్ నవ్వుతూ ఆనాటి జ్ఞాపకాన్ని పంచుకున్నారు. నిజానికి ఈ ప్రశ్నను అల్లు అరవింద్ భార్య నిర్మల.. ఆలీని అడగమని ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పారట. అందుకే ఆలీ ఈ ప్రశ్న వేశారు. దీనికి అల్లు అరవింద్ సమాధానం చెబుతూ.. ‘‘మా అమ్మ గారితో ఆయనకి ఏదో తగువు అవుతోంది. జనరల్‌గా వారిద్దరి మధ్య తగువు డ్రింక్ విషయంలో అవుతుంటుంది. ఏం తగువు అవుతుందో నాకు తెలీదు కానీ ఆయన అరుపులు నాకు మేడపైకి వినబడుతున్నాయి. కాసేపటి తరవాత మా అమ్మ ఇంటర్‌కామ్‌లో నాకు ఫోన్ చేశారు. నువ్వు అర్జెంటుగా షర్ట్ వేసుకుని కిందికి రా అన్నారు. గబగబా వచ్చాను. ‘నాతో దెబ్బలాడి ఆయన చెప్పులు కూడా వేసుకోకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిపోతున్నారురా’ అన్నారు. వెంటనే కారు (ఎస్‌యూవీ) తీసుకొని వెనకనుంచి వెళ్లాను. ఆయన సందు చివరి వరకు వెళ్లిపోయారు. కారు ఆపి ఎక్కండి అన్నాను. నేను ఎక్కను.. మీ అమ్మతో మాట్లాడను అని అరుస్తున్నారు. మీరు ముందు లోపలికి ఎక్కండి అన్నాను. ఎక్కారు. ఈయన రోడ్డెక్కేశాడని నాకు చాలా కోపంగా ఉంది. గేటు లోపలికి వెళ్లిన తరవాత ఆ కోపంలో బ్రేక్ గట్టిగా తొక్కేశా. నిజానికి నేను కావాలని వేయలేదు. గట్టిగా బ్రేక్ వేసేసరికి ఈయన వెళ్లి విండ్ షీల్డ్‌కి కొట్టుకోబోయారు. వెంటనే ఫట్‌మని నన్ను ఒక్కటి కొట్టారు. ఎవడ్రా నీకు డ్రైవింగ్ నేర్పింది వెధవ అని అన్నారు. ఆయనే నేర్పారు.. మరిచిపోయారు(నవ్వుతూ)’’ అని వెల్లడించారు. అయితే, ఈ అంశంలో మరో హైలైట్ విషయం ఉందని అల్లు అరవింద్ చెప్పారు. అదేంటంటే ఈయన్ని తండ్రి లాగిపెట్టి కొట్టడం భార్య చూసేయడం. ‘‘ఆయన నన్ను కొట్టగానే.. నేను పైకి చూశాను. పైన నా బెడ్‌రూంకి ఒక వరండా ఉంది. ఈ పక్కన మరో చిన్న వరండా ఉంది. నాన్న కొట్టడం ఎవరైనా చూశారా.. మా ఆవిడేమైనా చూసిందా అని నేను పైకి చూశాను. పైన ఎవరూ లేరు.. అంటే ఎవరూ చూడలేదు. ఇప్పుడు దీన్ని ఇష్యూ చేస్తే ఈయన నన్ను కొట్టినట్టు తెలిసిపోతుంది. కానీ, నాకు కోపం రగిలిపోతోంది. లోపలికి వెళ్లి ఇష్యూ చేస్తే తండ్రి దగ్గర ఈ వయసులో దెబ్బలు తిన్నానని మా ఆవిడకు తెలిసిపోతుంది. నా వయసు అప్పుడు 45.. 47 ఏళ్లు ఉంటాయి. ఈ వయసులో కూడా దెబ్బలు తిన్నాడనే తక్కువ అభిప్రాయం ఉంటుందని నేను చాలా తెలివిగా సైలెంట్ చేసేశాను. అక్కడి నుంచి మా అమ్మనాన్న వాళ్ల గొడవ కంటిన్యూ చేశారు. అంతా సద్దుమణిగిపోయింది. రాత్రి 9.30 నుంచి 10 గంటల మధ్య బెడ్‌రూంలోకి వెళ్లాను. ‘ఏవండీ ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను.. ఎందుకు మిమ్మల్ని మావయ్యగారు అలా కొట్టారు’ అంది. నువ్వెక్కడి నుంచి చూశావు అంటే.. నేను పైన వరండాలో ఉన్నాను, మిమ్మల్ని కొట్టగానే లోపలికి పారిపోయాను అంది. అబ్బా.. దీన్ని రభస చేసి రచ్చ చేయాల్సింది.. ఈవిడకి తెలుస్తుంది అనే కదా లోపలే దాచేశాను అనుకున్నాను’’ అని అల్లు అరవింద్ వివరించారు. అయితే, ఆరోజు తన తండ్రి కొట్టినప్పుడు ఎంత చేదుగా అనిపించిందో.. ఆ దెబ్బ తనకు అంత తీపి గుర్తు అని అరవింద్ చెప్పారు. ఈరోజుకీ దాన్ని తలుచుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుందని.. స్వీట్ మెమొరీ అని అన్నారు.