పీఎఫ్ఐ సంస్థకు ఉగ్రవాద సంస్థలతో దగ్గరి సంబంధాలున్నాయని, అందుకే దేశంలో ఆ సంస్థను నిషేధించాలని ఆలిండియా బార్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వారి కేసులను విచారించేందుకు దేశ వ్యాప్తంగా ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. దేశ సార్వభౌమత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, పీఎఫ్ఐపై బ్యాన్ విధించడానికి ఇదే సరైన సమయమని ఆలిండియా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అదీశ్ అగర్వాల్ సూచించారు.
మనీలాండరింగ్ కేసులు, నిషేధిత గ్రూపులతో సత్సంబంధాలు, సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు, బలవంతపు మత మార్పిళ్లు, యువతను ఇస్లాం వైపు ఆకర్షించడం లాంటి పనుల్లో పీఎఫ్ఐ పాత్ర వుందని, అందుకే వెంటనే నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్ఐఏ దేశ వ్యాప్తంగా సోదాలు చేసి, ఈ విషయాలను తమ విచారణలో వెల్లడించాయని, 100 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ కూడా చేసిందన్నారు. ఈ నేపథ్యంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పీఎఫ్ఐని కేంద్ర హోంశాఖ బ్యాన్ చేయాలని ఆలిండియా బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.