ఖతార్ లో జరిగే సాకర్ ప్రపంచ కప్ కు ముస్లింలందూ దూరంగా వుండాలని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా పిలుపునిచ్చింది. సాకర్ ప్రపంచ కప్ పేరుతో అనైతిక వ్యక్తులను, స్వలింగ సంపర్కులను, అవినీతి మరియు నాస్తికత్వాన్ని ప్రభుత్వం తీసుకొస్తోందని అల్ ఖైదా పేర్కొంది. అలాగే ముస్లింల అణచివేతకు ఈ పోటీలు ఉపయోగపడతాయని అల్ ఖైదా పేర్కొంది. ఈ ఈవెంట్ ను ఎవరూ ఫాలో కావొద్దని, పోటీలకు ఎవ్వరూ హాజరు కావొద్దని ముస్లింలను మేం హెచ్చరిస్తున్నాం అంటూ ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పేర్కొంది. ఈ విషయాన్ని సైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ బయటపెట్టింది. అయితే దీనిపై ప్రపంచ కప్ నిర్వాహకులు స్పందించారు. వారి వారి లైంగిక అలవాట్లతో సంబంధం లేకుండా… ప్రతి ఒక్కరూ ప్రపంచ కప్ వేడులకు హాజరు కావొచ్చని తేల్చి చెప్పింది.
ఇక.. ఖతార్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ జరుగుతోంది. అయితే ఇస్లాం కట్టుబాట్లను కచ్చితంగా పాటించే ఖతార్ లో ఇతర దేశీయులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్న విమర్శలు విపరీతంగా వస్తున్నాయి. తాజాగా… రెయిన్ బో టీషర్టు ధరించిన అమెరికా దేశానికి చెందిన స్పోర్ట్స్ జర్నలిస్టును అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనను ఫుట్ బాల్ జరుగుతున్న స్టేడియంలోకి అనుమతించలేదని, బయటే ఆపేశారని ఆయన ట్వీట్ చేశారు. చొక్కా మార్చుకుంటేనే అనుమతిస్తామని అధికారులు తేల్చి చెప్పారు. అయితే.. ఖతార్ దేశంలో స్వలింగ సంబంధం అనేది నేరం. అందుకే ఆ టీషర్ట్ ని తొలగించాలని అధికారులు సూచించారు.