కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం భ్రమలు మాత్రమే కల్పిస్తుందని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ దెప్పిపొడిచారు. ఆ భ్రమల్లో ప్రజలెవ్వరూ చిక్కుకోవద్దని కోరారు. ఖమ్మంలో జరుగుతున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సదస్సుకు ఆయన హాజరయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి నేటితో ఇంకా 399 రోజులే మిగిలి వున్నాయని, ఆ తర్వాత బీజేపీ ఓడిపోవడం ఖాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో కూర్చొని ఒక్కో రాష్ట్రాన్ని ధ్వంసం చేయాలని చూస్తోందని విమర్శించారు.

కేంద్రంలో బీజేపీని తరిమికొట్టే ఉద్యమం తెలంగాణ నుంచే నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని విమర్శించారు. కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలనే మోదీ సర్కార్ కాపీ కొడుతోందని ఆరోపించారు. కార్పొరేట్ వ్యవస్థకు బీజేపీ కొమ్ము కాస్తోందని, రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా మోదీ పాలన సాగుతుంటే.. కేసీఆర్ ఆధ్వర్యంలో అధికార వికేంద్రీకరణ జరుగుతోందని అఖిలేశ్ అన్నారు.