కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు. ఇన్ని రోజుల పాటు రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రలో వుంటూనే ఝలక్ ఇవ్వడంతో పార్టీలో అలజడి మొదలైంది. రాజస్థాన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకి ఓ లేఖ రాశారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు మద్దతుగా తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై ఇంతవరకూ పార్టీ అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారని, ఆ కారణంగానే ఆయన పార్టీ పదవికి రాజీనామా చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.
రాజస్థాన్ రాజకీయాలు ముందు నుంచీ వేడి పుట్టిస్తూనే వున్నాయి. సీఎం గెహ్లాత్ , యువనేత సచిన్ పైలట్ మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే వుంది. చివరికి అది బలపరీక్ష వరకూ వెళ్లింది. అధిష్ఠానం ఎంత చెప్పినా… ఇద్దరు నేతలు కూడా వినలేదు. దీంతో అధిష్ఠానం దూతగా అజయ్ మాకెన్ అక్కడికి వెళ్లారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత అవి సఫలం కావడంతో పార్టీ ఆయనకు ఇన్ ఛార్జీ బాధ్యతలు అప్పజెప్పింది.












