1వ పాశురము:-
మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిళైయీర్!
శీర్ మల్గుమ్ ఆయిప్పాడి చెల్వచ్చిఱుమీర్ కాళ్!
కూర్వేల్ కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్దకణ్ణి యశోదై యిళంజింగమ్
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱై దరువాన్
పారోర్ పుగళ ప్పడిన్దేలో రెమ్బావాయ్!
తాత్పర్యము:-
ఓహో! ఇది మార్గశిర్షమాసము. వెన్నల నిండిన మంచి రోజు. ఓ అందమైన ఆభరణములు గల పడచులారా ! ఐశ్వర్యముతో నిండిన వ్రేపల్లెలో సంపదలతో తులతూగుచున్న ఓ బాలికలారా !ఈ మార్గశీర్షస్నానము చేయవలెనని సంకల్పమున్నచో రండు, ముందు నడువుడు. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణనకు ఏవిధమగు ఆపదయు రాకుండ కాపాడుచున్న శ్రీనందగోపుల కుమారుడును అందములగు కన్నులతో అలరుచున్న యశోదయొక్క బాలసింహమును, నీలమేఘశ్యాముడును, ఎఱ్ఱతామరల పోలు కన్నులు కలవాడును, సూర్యునివలె ప్రకాశమును, చంద్రునివలె ఆహ్లాదమును ఈయజాలిని దివ్యముఖమండలము కలవాడును, అయిన నారాయణుడే, అతనినే తప్ప వేరొకనిని అర్థించని మనకే, మన మపేక్షించు వ్రతసాధనమగు ’పర’ అను వాద్యమును ఈయనున్నాడు. మన మీ వ్రతము చేయుటను చూచి లోకులందరు సంతోషించునట్లు మీరందరు వచ్చి ఈ వ్రతములో చేరుడు.
తిరుప్పావై – 2వ పాశురము
బ్రహ్మశ్రీ కంభంపాటి నాగఫణిశర్మ తెలుగు అనువాదముతో
వైయత్తు వాళ్వీర్గాళ్! నాముమ్ నమ్బావైక్కు
చ్చెయ్యుఙ్గిరిశైగళ్ కేళీరో, పాఱ్కడలుళ్
పైయ త్తుయిన్ఱ పరమనడిపాడి
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోమ్ మలరిట్టు నామ్ ముడియోమ్
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముమ్ పిచ్చైయుమాన్దనైయుఙ్గైకాట్టి
ఉయ్యు మాణెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.
తాత్పర్యము:-
కృష్ణుడు అవతరించిన కాలములో ఈ లోకములో పుట్టి దుఃఖమయమగు ఈ ప్రపంచములో కూడ ఆనందమునే అనుభవించుచున్నవారలారా! మేము మా వ్రతమునకు చేయు క్రియాకలాపము వినుడు – పాలసముద్రములో పండుకొనియున్న ఆ పరమపురుషుని పాదములకు ధ్వని కాకుండ మెల్లగా మంగళము పాడెదము. ఈ వ్రతసమయములో నేతిని గాని, పాలనుగాని మే మారగింపము. తెల్లవారుజాముననే లేచి స్నానము చేసెదము. కంటికి కాటుక పెట్టుకొనము. కొప్పులో పూవులు ముడువము. మా పెద్దలు ఆచరింపని పనులు ఆచరింపము. ఇతరులకు బాధ కలిగించు మాటలను, అసత్యవాక్యములను ఎచ్చోటనూ పలుకము. జ్ఞానాధికులకు అధిక ధనధాన్యాదులతో సత్కరించుచుందుము. బ్రహ్మచారులకు సన్యాసులకు భిక్షల నొసంగుచుందుము. మేము ఉజ్జీవించు విధమునే పర్యాలోచన చేసికొందుము. దీని నంతను విని, మీ రానందింప కోరుచున్నాము
తిరుప్పావై – 3వ పాశురము
బ్రహ్మశ్రీ కంభంపాటి నాగఫణిశర్మ తెలుగు అనువాదముతో
ఓఙ్గి యులగళన్ద ఉత్తమన్ పేర్పాడి
నాంగళ్ నమ్బావైక్కు చ్చాత్తి నీరాడినాల్
తీంగన్ఱి నాడెల్లామ్ తింగళ్ ముమ్మారి పెయ్ దు
ఓంగు పెరుఞ్జెన్నెల్ ఊడు కయలుగళ
పూంగువళై ప్పోదిల్ పొరివణ్డు కణ్పడుప్ప
తేంగాదే పుక్కిరున్దు శీర్ త్తములై పత్తి
వాంగక్కుడమ్ నిరైక్కుమ్ వళ్ళల్ పెరుమ్పశుక్కళ్
నీంగాదశెల్వమ్ నిరైన్దేలో రెమ్బావాయ్.
తాత్పర్యము:-
బలి చక్రవర్తి ఇచ్చిన దానమునందు, ఆకాశమువరకు పెరిగి, మూడు లోకములను తన పాదములచే కొలిచిన పురుషోత్తముడగు త్రివిక్రముని దివ్యనామములను గానము చేసి, మేము మా వ్రతము అను మిషతో స్నానము చేయగనే, దేశమంతయు నెలకు మూడువానలు పడి, ఈతిబాధలు లేక సుఖముగా ఉండవలెను. ఆకాశమువరకు పెరిగిన వరిచేలలో చేపలు త్రుళ్లిపడుచుండగా, కలువపూవులలో మనోహరములగు తుమ్మెదలు నిద్రించుచుండగా, సస్యములు సమృద్ధములై యుండవలెను. పాలు పితుకుటకు కొట్టములోదూరి, స్థిరముగా కూర్చుండి, పొదుగు నంటగనే పాలు కుండలు నిండునట్లు చేవు గోవులు సమృద్ధముగా నుండవలెను. నశ్వరము కాని సంపదదేశమంతా నిండవలెను.
తిరుప్పావై – 4వ పాశురము
బ్రహ్మశ్రీ కంభంపాటి నాగఫణిశర్మ తెలుగు అనువాదముతో
ఆళిమళైక్కణ్ణా ! ఒన్రు నీకై కరవేల్
ఆళియుళ్ పుక్కు ముగన్దు కొడార్ త్తేరి
ఊళిముదల్వ నురువమ్పోల్ మెయికరుత్తు
పాళియందోళుడై ప్పర్పనాబన్ కైయిల్
ఆళిపోళ్ మిన్ని వలమ్బురి పోల్ నిన్రదిర్న్దు
తాళాదే శార్ జ్ఞ్గముదైత్త శరమళైపోల్
వాళవులగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళ్ న్దేలో రెమ్బావాయ్
తాత్పర్యము:-
గంభీరస్వభావుడా! వర్షనిర్వాహకుడా! ఓ పర్జన్యదేవా! నీవు దాతృత్వములో చూపు ఔదార్యమును ఏ మాత్రమును సంకోచింపజేయకుము. గంభీరమగు సముద్రములో మధ్యకు పోయి, ఆ సముస్రజలమునంతను, నీవు పూర్తిగా త్రాగి, గర్జించి, ఆకాశమున వ్యాపించి, సర్వజగత్కారణభూతుడగు శ్రీ నారాయణుని దివ్యవిగ్రహము వలె శ్యామలమూర్తివై, ఆ పద్మనాభుని విశాలసుందరబాహుయుగళిలో దక్షిణబాహువునందలి చక్రము వలెమెరిసి, ఎడమచేతిలోని శంఖము వలె ఉరిమి, శార్ఙ్గమను ధనస్సునుండి విడిచిన బాణముల వర్షమా అనునట్లు లోకమంతయు సుఖించునట్లు, మేము సంతోషముతో మార్గశీర్షస్నానము చేయునట్లు వర్షించుము.!!
మీ
నందగోపాలమోహనవంశీకృష్ణశర్మ బిదురు