టాలీవుడ్ నటుడు, దర్శకనిర్మాత వల్లభనేని జనార్ధన్ (63) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు వున్నాడు. మొదటి అమ్మాయి శ్వేత. చిన్నతనంలోనే చనిపోయింది. రెండో కూతురు అభినయ ఫ్యాషన్ డిజైనర్ గా స్థిరపడింది. ఇక… అబ్బాయ్ అవినాశ్ అమెరికాలో ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. జనార్ధన్ మృతిపట్ల సీనీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
జనార్దన్ విజయవాడకు చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచే నాటకాలపై ఆసక్తి. దీంతో కాలేజీ రోజుల్లోనే నాటకాలు వేస్తూ, పేరు తెచ్చుకున్నారు. కళాశాల చదువు ముగిసిన వెంటనే కళామాధురి అనే నాటక సంస్థను స్థాపించారు. దీని ద్వారా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. మెళ్లిగా ఇండస్ట్రీలోకి వచ్చారు. మొదట దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన గజదొంగ సినిమాలో కనిపించారు. ఆ తర్వాత విజయ బాపినీడు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. తర్వాత విజయ బాపినీడు తెరకెక్కించిన గ్యాంగ్ లీడర్ లో పోలీస్ అధికారిగా నటించి, బాగా పేరును సంపాదించుకున్నాడు. ఈ సినిమా తర్వాతే… ఛాన్సులు బాగా వచ్చాయి. సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా నటించారు. వీటితో పాటు చంద్రమోహన్ హీరోగా నటించిన అమాయక చక్రవర్తి సినిమాకు దర్శకత్వం వహించారు. తన కుమార్తె శ్వేత పేరు మీద శ్వేత ఇంటర్నేషనల్ సంస్థను స్థాపించి, శ్రీమతి కావాలి, పారిపోయిన ఖైదీలు అనే రెండు చిత్రాలను రూపొందించారు. దాదాపు 100 సినిమాల్లో జనార్దన్ నటించారు.












