ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ (79) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన కృష్ణను కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది.

1942 మే 31 న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో జన్మించారు. వీర రాఘవయ్య చౌదరి, నాగరత్న తల్లిదడ్రులు. ఐదుగురు సంతానం లో ఈయన పెద్ద వారు. చిన్నప్పటి నుంచే కృష్ణకు సినిమా రంగంపై ఆసక్తి. 1965 లో ఇందిరను పెళ్లి చేసుకున్నారు. వారికి ఐదుగురు పిల్లలు. రమేశ్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల. వీరిలో రమేశ్ బాబు, భార్య ఇందిర ఇటీవలే మరణించారు. మొదటి పెళ్లి తర్వాత సినీనటి విజయ నిర్మలను రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమె కూడా ఈ మధ్యనే మరణించారు.
అయితే… తల్లిదండ్రులకు కృష్ణను ఇంజినీరింగ్ చదవించాలని కోరిక వుండేది. కానీ… కృష్ణకు సినిమా రంగమంటే ఆసక్తి. డిగ్రీ తర్వాత ఇంజినీరింగ్ సీటు కోసం ప్రయత్నించినా… రాకపోవడంతో కృష్ణ ఇక సినిమాలనే ఎంచుకున్నారు. 1964 లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన తేనె మనసులు సినిమాతో సినీ ప్రయాణం ప్రారంభమైంది. ఈ సినిమా ఘన విజయం సాధించింది.

ఆ తర్వాత కన్నె మనసులు, గూఢచారి 116 లో అవకాశం వచ్చింది. గూఢచారి 116 అఖండ విజయమే సాధించింది. దీంతో సినిమాలు తన్నుకుంటూ వచ్చాయి. గూఢచారి 116 తో కృష్ణ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇలా మరో 6 జేమ్స్ బాండ్ సినిమాలను చేశారు. నాలుగు దశాబ్దాల పాటు సాగిన సినిమా ప్రయాణంలో కృష్ణ 340 కి పైగా సినిమాలు చేశారు. దర్శకుడిగా 16 సినిమాలు తెరకెక్కించారు.













