విజయదశమి విశిష్టత….

శ్లో II ఆశ్వినే శుక్ల పక్షేతు దశామ్యామపరాజితా పూజనీయా ప్రయత్నేన క్షేమర్ధంచ నృపైస్సదా.

శ్లో II నవమీ శేష యుక్తాయా దశమ్యా మపరాజితా పూజనీయా ప్రయత్నేన క్షేమార్ధంచ నృపైస్సదా.

శ్లో II నవమీ శేష యుక్తాయా దశమ్యా మపరాజితా దధాతి విజయందేవి పూజితా జయవర్ధనీ.

అను శాస్త్ర ప్రమాణములను అనుసరించి గౌణకాలములందు దశమీ తిధి వ్యాప్తి చెంది ఉన్నందున తేది 05 అక్టోబర్ 2022 బుధవారం రోజుననే విజయదశమి పండగ ఆచరించవలెను.
విజయదశమి రోజున సూర్యోదయానికి శ్రవణ నక్షత్రం ఉండాలి. శ్రవణ నక్షత్రానికి ఆది దేవుడు విష్ణువు. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. అందుకే ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకొనేవారు ఈ రోజున ప్రారంభింస్తే విశేషంగా లాభిస్తుంది. శమీ చెట్టు పూజ ఈ రోజు విశేషంగా లాభిస్తుంది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మిచెట్టు ఆకులను ఇంట్లోని పూజా స్థలంలో, ధన స్థానంలో, గల్ల పెట్టెల్లో పెట్టుకుంటారు. దీనివలన ధన వృద్ధి జరుగుతుందని నమ్మకం.
నవరాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం. అందుచేత సృష్టికి కారణమైన మహా మాయ తీవ్రవేగం కలిగి ఉంటుంది. పూజాదుల చేత అమ్మవారిని ఆహ్వానించటం సులభ సాధ్యం. తొమ్మిది రోజులు నవ దుర్గలను నిష్ఠగా ఉపాసించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రుల్లో రాహుకాల సమయంలో దీపం వెలిగించాలి. దీనివలన రాహు ప్రతికూల ప్రభావం తగ్గి, దోష నివారణ జరుగుతుంది. దేవి అర్చనలో లలితా సహస్రనామాలు, దుర్గాసప్తశతి పారాయణ చేసే భక్తుల కోరికలు నెరవేరుతాయి. రోగ పీడలతో బాధపడే వారు, జాతకంలో అపమృత్యు దోషం ఉన్నవారు ఈ తొమ్మిది రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేయడం శుభకరం.
చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకార అనే పది దుర్గుణాలను ఈ నవరాత్రులలో అమ్మ వారి శరణుజొచ్చి తమలో ఉన్న దుర్గుణాలను తొలగించు కునుటకు ఆధ్యాత్మికంగా ఉత్తమైన మార్గం ఈ శరన్నవరాత్రులు.
విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు.
బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్దం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పదునేనమిది చేతులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసురుని తరపున యుద్దానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది.
ఈ యుద్దములో ఆదేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవ రూపముతో భీకరముగా పోరు. చివరకు మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా పిలవబడింది. అదే విజయదశమి ఈ రోజునే శమీ పూజ కుడా నిర్వహిస్తారు.
పరమ శివునికి జగన్మాత దుర్గాదేవికి, సిద్ది ప్రదాత గణపతికి శమీ పత్రి సమర్పించే ఆచారం అనాదిగా వస్తోంది. పూర్వం జమ్మిచెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే యజ్ఞ యాగాదుల క్రతువులు నిర్వహించేవారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో శమీ వృక్షంలో అగ్ని ఉంటుందనే విశ్వాసం దృడపడింది. అగ్ని వీర్యమే సువర్ణం కనుక జమ్మి బంగారం కురిపించే చెట్టుగా పూజార్హత పొందింది. శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని చెబుతారు. శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపజేసేది. పంచ పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలని శమీ చెట్టుపై పెట్టడం జరిగింది. సామాన్యులే గాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ఆలయాలలో అమ్మవారికి విశేష అలంకరణలు చేసి పూజిస్తారు.
అమ్మవారు లోక కళ్యాణం కోసం ఒక్కోరోజు ఒక్కో అవతారం ధరించింది. అలా ఆయా రూపాలతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు.!!
మీ
నందగోపాలవంశీకృష్ణశర్మ బిదురు {కృష్ణాయజుర్వేదా ఘణాపాఠి}

Related Posts

Latest News Updates