అమెరికాలో మరో భారతీయ అమెరికన్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా ఎయిర్పోర్స్లో బ్రిగేడియర్ జనరల్ గ్రేడ్ పదవికి తెలుగు వాడైన రాజాచారిని అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. ఈ మేరకు అమెరికా రక్షణ శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. 45ఏళ్ల రాజాచారి ప్రస్తుతం అమెరికా వైమానిక దళంలో కర్నల్ హోదాలో కొనసాగుతున్నారు. గత ఏడాది అంతరిక్షయానం కూడా పూర్తి చేసిన రాజాచారి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో వ్యోమగామిగా, క్రూ-3 కమాండర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
రాజాచారి తండ్రి శ్రీనివాస్ వి. చారి హైదరాబాద్కు చెందిన వ్యక్తి. ఉన్నత విద్య చదివేందుకు అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అమెరికన్ అయిన పెగ్గీ ఎగ్బర్ట్ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 1977లో రాజాచారి జన్మించారు. అమెరికా నావల్ టెస్ట్ పైలట్ స్కూల్లోనూ విద్యనభ్యసించిన రాజాచారి, 2017లో నాసా ఆస్ట్రోనాట్ క్యాండిడెట్ క్లాస్కు ఎంపికయ్యారు. 2021లో నాసా, స్పేస్ఎక్స్ జాయింట్గా ప్రయోగించిన క్రూ-3 మిషన్లో రాజాచారి సభ్యుడుగా ఉన్నారు.