భారత సంతతి శాస్త్రవేత వెంకి రామకృష్ణన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇంగ్లాండ్‌లో ప్రసిద్ధ బ్రిటన్ విశిష్ట సేవా పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. బ్రిటన్ రాజు చార్లెస్`3 చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకోనున్నారు. సాయుధ బలగాలు, సైన్స్, ఆర్ట్, లిటరేచర్ తదితర ఆరు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. దివంగత బ్రిటన్ రాణి ఎలిజబెత్`2 మరణానికి ముందే ఆరుగురి పేర్లను ఖరారు చేశారు. తాజాగా చార్లెస్`3 చేతుల మీదుగా పతకాలను బహుకరించేందుకు బకింగ్‌హోమ్ ప్యాలస్ ఏర్పాట్లు చేస్తోంది. విశిష్ట సేవా పథకం (ఆర్డర్ ఆఫ్ మెరిట్) అనేది బ్రిటన్ రాజు అందించే ప్రత్యేక గౌరవానికి ప్రతీక. ప్రొఫెసర్ వెంకీ రామకృష్ణన్ తమిళనాడులోని చిదంబరంలో జన్మించారు. అమెరికాలో జీవశాస్త్రం అభ్యసించారు. అనంతరం బ్రిటన్‌కు వెళ్లి కేంబ్రిడ్జి యూనివర్సిటీలో అణుజీవశాస్త్రంపై పరిశోధనలు చేస్తున్న బృందానికి నాయకత్వం వహించారు. రైబోజోములు, వాటి నిర్మాణంపై చేసిన పరిశోధనలకు గానూ 2009లో నోబెల్ బహుమతి వరించింది. 2015 నవంబరు నుంచి 2020 నవంబరు వరకు రాయల్ సొసైటీ అద్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. మరోవైపు ఆయన ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీలో విదేవీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.
