తెలుగు సినిమా అగ్ర హీరోల్లో ఒకరైన మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ‘సీనియర్ నటుడు కృష్ణ, మహేష్ సహా కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగి ఉన్నారు. అయితే అంతకు ఓ రోజు ముందు ఓ వ్యక్తి ఆయన ఇంట్లోకి చొరబడి దొంగతనానికి ప్రయత్నించినట్లు వార్తలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. మహేష్ బాబు జూబ్లీ హిల్స్ రోడ్ నెం.81లో నివాసం ఉంటున్నారు. తెలిసి వచ్చాడో, తెలియక వచ్చాడో కానీ.. ఒరిస్సాకు చెందిన కృష్ణ అనే వ్యక్తి చొరబడే ప్రయత్నం చేశాడు. మంగళవారం రాత్రి ప్రహరి గోడను కృష్ణ అనే వ్యక్తి దాటాడు. ఈ దూకే ప్రయత్నంలో అతనికి గాయాలయ్యాయి. అక్కడే పడిపోయాడు. శబ్దం రావటంతో సెక్యూరిటీ వెళ్లి చూడగా, గాయాలతో పడి ఉన్న వ్యక్తి కనిపించాడు. వెంటనే వాళ్లు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు గాయపడ్డ ఒరిస్సా వ్యక్తిని హాస్పిటల్లో జాయిన్ చేసి విచారణ చేయగా, అతను మూడు రోజుల ముందు హైదరాబాద్ వచ్చి ఇక్కడే ఉన్న నర్సరీలో పని చేస్తున్నట్లు తెలిసింది. గాయపడ్డ వ్యక్తి కోలుకున్న తర్వాత పూర్తి స్థాయి విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు.