భారత్ మరో సూపర్ పవర్ గా అవతరించడం ఖాయమని శ్వేతసౌధం ఆసియా కో ఆర్డినేటర్ కర్ట్ క్యాంప్ బెల్ ప్రకటించారు. సూపర్ పవర్ గా ఎదిగే శక్తి సామర్థ్యాలు భారత్ కు సంపూర్ణంగా వున్నాయన్నారు. ఆస్పెన్ సెక్యూరిటీ ఫోరమ్ సమావేశంలో వైట్‌హౌస్ వైట్‌హౌస్ ఆసియా కోఆర్డినేటర్ కర్ట్ క్యాంప్‌బెల్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్‌పై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, తన దృష్టిలో 21వ శతాబ్దంలో అమెరికాకు భారతదేశం అత్యంత ముఖ్యమైన ద్వైపాక్షిక దేశమని అన్నారు.
గత 20 ఏళ్లలో అమెరికా, భారత్ సంబంధాలు బలపడిన స్థాయిలో మరే దేశంతో ద్వైపాక్షిక బంధం మెరుగుపడలేదని చెప్పారు. తన దృష్టిలో 21వ శతాబ్దంలో అమెరికాకు అత్యంత ముఖ్యమైన ద్వైపాక్షిక బంధం భారత్‌తోనే ఉందన్నారు. ”భారత్ లో విభిన్నమైన వ్యూహాత్మక లక్షణం ఉంది. అది అమెరికా మిత్రదేశంగా ఉండబోదు. మరో గొప్పశక్తిగా అవతరిస్తుంది. ప్రతి దశలోనూ వివిధ అంశాల్లో ఇరు దేశాల బంధం మరింత బలపడటానికి చాలా కారణాలున్నాయి.” అని కర్ట్ క్యాంప్ బెల్ అన్నారు.












