ఇబ్రహీం పట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రంగారెడ్డి డీఎంహెచ్ వో స్వరాజ్య లక్ష్మిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే డీసీహెచ్‌ఎస్‌ ఝాన్సీ లక్ష్మిపై బదిలీ వేటువేసింది. ఆపరేషన్లు చేసిన డాక్టర్‌ జోయల్‌ సునీల్‌ కుమార్‌పై క్రిమినల్‌ కేసు నమోదుచేసింది. వీరితోపాటు మొత్తం 13 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది. ఇలాంటి ఘటనలు పునరావృతమవకుండా ఉండేలా మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని టీచింగ్ ఆస్పత్రులు, వైద్య విధాన పరిషత్ హాస్పిటళ్లు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు వీటిని కచ్చితంగా పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

 

ఆగస్టు 25 న ఇబ్రహీం పట్నంలో 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. అయితే శస్త్ర చికిత్స వికటించి, నలుగురు మహిళలు మరణించారు. ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని వేసింది. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫార్సు చేసింది. దీనికి అనుగుణంగానే ప్రభుత్వం వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.