కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై కొంత భాగం క్లారిటీ వచ్చేసింది. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం లేదని రాజస్థాన్ సీఎం గెహ్లాట్ ప్రకటించేశారు. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముందు నుంచీ తాను బరిలో లేనని ప్రకటిస్తున్నా… ఆఖరి నిమిషంలో మనసు మార్చుకోవడమో, కార్యకర్తల నుంచి ఒత్తిడి వచ్చి, అధ్యక్ష పగ్గాలు చేపడతారన్న ఊహాగానాలు వుండేవి. ఆ ఊహాగానాలన్నింటికీ గెహ్లాట్ తెర దించేశారు. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగరని తేల్చి చెప్పారు. తాను మాత్రం నామినేషన్ దాఖలు చేస్తానని ప్రకటించారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీ చేపట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, అదే విషయాన్ని ఆయనకు చాలాసార్లు చెప్పానని తెలిపారు. తన విజ్ఞప్తిపై రాహుల్ స్పందిస్తూ, కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు గాంధీ కుటుంబానికి చెందినవారై ఉండకూడదని స్పష్టం చేశారన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల కోసం తాను త్వరలోనే తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తానని గెహ్లాట్ చెప్పారు. దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రతిపక్షాలు బలంగా ఉండవలసిన అవసరం ఉందని తెలిపారు.