విజయవాడలో ఉన్న డా.ఎన్టీఆర్ హెల్త్ యూనిమర్సిటీ పేరును డా.వైఎస్‌ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చే బిల్లును ఏపీ శాసనసభ బుధవారం ఆమోదించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ నిర్ణయంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా NTR సంపాదించుకున్న కీర్తిని తగ్గించలేరన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై పెద్ద రచ్చ జరుగుతోంది. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా పేరు మార్చడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, ఎన్టీఆర్ అభిమానులు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ.. తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇతర పార్టీల నాయకులు కూడా ఖండిస్తున్నారు. ‘ఎన్టీఆర్ , వైఎస్‌ఆర్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం YSR స్థాయిని పెంచదు, NTR స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా NTR సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు’ అంటూ తారక్ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు పాజిటివ్‌గా కామెంట్స్ పెడుతుంటే.. మరికొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఈ సెన్సిటివ్ మ్యాటర్‌పై మీరు స్పందించిన తీరు ఎంతో హుందాగా.. కన్వీన్సింగ్‌గా ఉంది.. లెజండరీ ఎన్టీఆర్‌లోని హుందాతనం.. మీలో కూడా కనిపిస్తుంది..’ అని అంటున్నారు. కానీ ‘కర్ర విరగలేదు.. పాము చావలేదు అన్నట్లు ఉంది. ఎన్టీఆర్ స్టేట్‌మెంట్ వల్ల ఏం ఉపయోగం. ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నారా..? లేదా..?’ అని అడుగుతున్నారు.
— Jr NTR (@tarak9999) September 22, 2022