తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సీఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి అక్టోబర్ 3 వరకూ జరగనున్న బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. సద్దుల బతుకమ్మకు ట్యాంక్ బండ్ వద్ద అద్భుతమైన ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మ లోగోలను ఏర్పాటు చేయాలన్నారు.

 

అలాగే సిటీతో పాటు జిల్లాల్లో కూడా ఘనంగా నిర్వహించాలని తెలిపారు. బతుకమ్మ ఘాట్‌తోపాటు ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని, విద్యుద్దీపాలతో అలంకరించాలని ఆదేశించారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ప్రసార మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా బాగా ప్రచారం కల్పించాలన్నారు.