డీఎంకే సీనియర్ నేత సుబ్బులక్ష్మి జగదీశన్ ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటిస్తూ… డీఎంకే పార్టీకి రాజీనామా చేసేశారు. ఈ మేరకు పార్టీ అధినేత, సీఎం స్టాలిన్ కు లేఖ రాశారు. ఈరోడ్ జిల్లా మొడకుర్చి ప్రాంతానికి చెందిన సుబ్బులక్ష్మి జగదీశన్ దివంగత మాజీమంత్రి సర్గుణ పాండ్యన్ తర్వాత సుదీర్ఘకాలంగా పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో మొడకుర్చి నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆమె బీజేపీ అభ్యర్థి సరస్వతి చేతిలో 206 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. తన ఓటమికి జిల్లాకు చెందిన ఓ ప్రముఖుడు, తన నియోజకవర్గంలోని ఇద్దరు ప్రాంతీయ కార్యదర్శులు కారణమంటూ సుబ్బులక్ష్మి పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆమె అసంతృప్తిగా వున్నట్లు తెలిసింది.
1947 లో ఎరోడ్ జిల్లాలో జన్మించిన సుబ్బులక్ష్మి జగదీశన్… డీఎంకే పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. తిరుచెంగోడ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. కేంద్రం ప్రభుత్వంలో సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రిగా 2004,09 వరకూ పనిచేశారు. అంతకు ముందు డీఎంకే ప్రభుత్వంలో పలు శాఖలు కూడా నిర్వహించారు.