బంజారాహిల్స్ రోడ్డు నంబర్ -10లో కొత్తగా నిర్మించిన కొమురం భీం ఆదివాసీ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.స్వరాష్ట్రంలో ఆదివాసీ, గిరిజన, లంబాడీ బిడ్డలందరూ తలెత్తుకునేలా ఆదివాసీ భవన్ నిర్మించామని అన్నారు. ఆదివాసీ భవన్ గిరిజన బిడ్డల హక్కుల పరిరక్షణకు వేదిక కావాలని, వారి సమస్యల పరిష్కారానికి మార్గం చూపాలని ఆకాంక్షించారు. గిరిజన బిడ్డల సమస్యలు తీర్చాల్సిన అవసరముందని, ఇందుకోసం ఒక్కో అడుగు వేస్తున్నామని కేసీఆర్ అన్నారు. చదవు, విదేశాలకు వెళ్లడం, గిరిజన పోడు భూముల విషయంలో ఆదివాసీ బిడ్డల రక్షణ విషయంలో క్రమంగా పురోగమిస్తున్నామని చెప్పారు.
ఎంతో మంది బంజారా బిడ్డలు ఉత్తమమైన సేవలు అందిస్తున్నారని, అనేక రంగాల్లో అనేక హోదాల్లో పని చేస్తున్నారని కేసీఆర్ ప్రశంసించారు. రాష్ట్రంలోని నీటి పారుదల శాఖలో మన బంజారా బిడ్డ హరే రామ్ అందించే సేవలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. అలా అనేక రంగాల్లో అనేక మంది అధికారులు ఉన్నత స్థాయిల్లో పని చేస్తున్నారని గుర్తు చేసుకున్నారు.
పోడు భూముల సమస్యలను త్వరలోనే పరిష్కారం చేసుకోబోతున్నామని కేసీఆర్ ప్రకటించారు. బంజారా ప్రజాప్రతినిధులంతా యాక్టివ్గా ఉండి.. పోడు భూముల పరిష్కారంలో చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు. మన బిడ్డలకు న్యాయం జరిగేలా చూడాలని మీ అందర్నీ కోరుతున్నానని అన్నారు. అడవులు, తండాల్లో ఉన్న మన బిడ్డలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు వెళ్తున్నారు. వారి బతుకులను బాగు చేసేందుకు ఈ రాష్ట్రంలో జరగాల్సిన చర్చలు ఈ భవనం నుంచి జరగాలని కోరతున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.