తాము తీసుకొచ్చిన విద్యుత్ చట్ట సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరించుకోమని కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం విద్యుత్ రంగంలో వున్న ఏకఛత్రాధిపత్యాన్ని అడ్డుకునేందుకే విద్యుత్ చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చామన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ విద్యుత్ రంగంలో ఏకఛత్రాధిపత్యాన్ని కోరుకుంటున్నారని, అందుకే చట్ట సవరణ బిల్లును అడ్డుకుంటున్నారని ఆర్కే సింగ్ ఆరోపించారు. సీఆర్ చెప్పినట్లు విద్యుత్ బిల్లులో సబ్సిడీలు ఎత్తివేస్తున్నట్లు ఎక్కడా లేదని స్పష్టం చేశారు. రైతులు, ఇతర వర్గాలకు ఇచ్చే సబ్సిడీలను ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదన్నారు.
ప్రజలకు మేలు చేసేందుకే విద్యుత్ బిల్లును తీసుకొచ్చామన్న మంత్రి… తక్కువ ధరకు విద్యుత్ సేవలు అందించడమే బిల్లు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. విద్యుత్ బిల్లు వల్ల కంపెనీల మధ్య పోటీ తత్వం పెరిగి… తక్కువ ధరకే నాణ్యమైన కరెంట్ లభిస్తుందని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ సంస్కరణ బిల్లును వెనక్కి తీసుకునేది లేదని మంత్రి ఆర్కే సింగ్ స్పష్టం చేశారు. అంతేగాక విద్యుత్ చట్ట సవరణ బిల్లు ద్వారా ప్రస్తుతం పలు రాష్ట్రాలు ఇచ్చే విద్యుత్ సబ్సిడీలను ఏ రకంగానూ అడ్డుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఉచిత విద్యుత్ తో పాటు సబ్సిడీల విషయంలో కేంద్రానికి ఎలాంటి అభ్యంతరమూ లేదని ఆర్కే సింగ్ పేర్కొన్నారు.