రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అయితే.. రాష్ట్రంలో ప్రస్తుతం రాజధాని చర్చే జరుగుతోంది కాబట్టి… మూడు రాజధానులపై మొదటి రోజే స్వల్ప కాలిక చర్చ జరిపేందుకు ప్రభుత్వం సుముఖంగా వున్నట్లు సమాచారం. మూడు రాజధానులపై సీఎం జగన్ సభ నుంచి ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు ఎంత లాభం చేకూరుతుందో సీఎం జగన్ సభ ద్వారా మరోసారి వివరించనున్నారు. ఇక… రాజధాని అమరావతి రైతులు అమరావతి నుంచి అరసవెల్లి వరకూ చేపట్టిన పాదయాత్రపై ఇప్పటికే మంత్రులు ,ఎమ్మెల్యేలు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించేందుకు కూడా వైసీపీ రెడీ అవుతోంది.
చంద్రబాబు ఈ సమావేశాలకు హాజరై, చర్చల్లో పాల్గొనాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అనేక అంశాలు చర్చకు వస్తాయని, దీనిలో చంద్రబాబు పాల్గొనాలని సవాల్ విసిరారు. అసెంబ్లీలో అడుగు పెట్టనని చంద్రబాబు శపథం చేశారని, కానీ.. వారి ఎమ్మెల్యేలు మాత్రం సభకు వస్తారని, ఇదేం పద్ధతి అని అంబటి మండిపడ్డారు.
మరోవైపు శాసన సభ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని, మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సమీక్ష నిర్వహించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలన్నీ సకాలంలో సమాధానాలు ఇచ్చేలా అందరూ సిద్ధంగా వుండాలని శాఖలను ఆదేశించారు. అలాగే ఆయా శాఖల కార్యదర్శులు, పోలీసు విభాగం అలర్ట్ గా వుండాలని సూచించారు.