స్త్రీలకు, పర్యావరణానికి అవినాభావ సంబంధం వుందని, అనంతపురం లాంటి కరువు జిల్లాల్లో కూడా అతి తక్కువ నీటితో ఇంటిని నడిపే మహిళలు వున్నారని ఐఎఫ్ఎస్ రిటైర్డ్ అధికారి రామలక్ష్మి అన్నారు. సహజ వనరుల పరిరక్షణలో స్త్రీలది ప్రముఖ పాత్ర అని, ప్రపంచవ్యాప్తంగా అనేక పర్యావరణ ఉద్యమాలు మహిళల నేతృత్వంలోని జరిగాయని జరుగుతున్నాయని తెలిపారు. రేపటి తరం కోసం మనం ఇప్పుడే ఆలోచించి ప్రకృతి వనరులను పరిరక్షించుకోవాలని ఆమె సూచించారు. న్మాస్ పల్లిలోని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ ఎర్త్ సెంటర్ లో పర్యావరణ పరిరక్షణపై మహిళా జర్నలిస్టులతో సమావేశం నిర్వహించారు. భారతదేశానికి సంబంధించి పర్యావరణ పరిరక్షణకు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ చేసిన చట్టాలను మరే ప్రభుత్వం చేయలేదని, సునీత నారాయణ వందనా శివా లాంటి ఎంతోమంది మహిళలు పర్యావరణం కోసం పనిచేస్తున్నారని ఉదహరించారు. మనం కనుక ఇప్పుడు ప్రకృతిని పరిరక్షించుకోనట్లయితే భవిష్యత్తు తరాలు కరోనా లాంటి అనేక విపత్తులను ఎదుర్కోవలసి ఉంటుందని రామలక్ష్మి హెచ్చరించారు.

 

పర్యావరణానికి మంచి చేయాలన్న సదుద్దేశంతోనే ఎర్త్ సెంటర్ ను ఏర్పాటు చేశామని సీజీఆర్ అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణ అనే అంశాన్ని మహిళా జర్నలిస్టులందూ ఓ సవాల్ గా తీసుకోవాలని సూచించారు. భూమాత ఎంతో ఇస్తోందని, భూమాత కోసం పనిచేయాలని కోరారు. మహిళా జర్నలిస్టులు తమ తమ మీడియా సంస్థల ద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని ఆమె సూచించారు. భావి తరాలకు కాలుష్య రహిత పంచభూతాలను అందించాల్సిన అవసరం ప్రస్తుత సమాజంపై వుందని ఆమె పేర్కొన్నారు.

 

మొక్కలు నాటడమే పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసినట్లని, అందుకే తమ సంస్థ తరపున 50 లక్షలకు పైగా మొక్కలు నాటామని ఆమె వెల్లడించారు. ఇకపై ప్రతి సంవత్సరం రక్షా బంధన్ రోజున వృక్షాబంధన్ పేరిట కార్యక్రమాలను ఏర్పాటు చేసి, నాటిన ప్రతి చెట్టుకు పుట్టిన రోజు పండుగ చేసే అలవాటును పిల్లలకు నేర్పించామని లీలా లక్ష్మారెడ్డి తెలిపారు.

 

తూర్పు కనుమల పరిరక్షణలో భాగంగా దాదాపు 1700 కిలోమీటర్లు పర్యటించి, రాజకీయ విధాన నిర్ణయాలు చేయాలంటూ పుస్తకం రూపొందించి, మేధావులకు ప్రభుత్వాలకు సమర్పించామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ డైరెక్టర్ వసంత లక్ష్మి, సీనియర్ జర్నలిస్ట్ గాయత్రి తదితరులు కూడా ప్రసంగించారు. దాదాపు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలకు సంబంధించి 30 మంది మహిళా జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొని అనేక అంశాలు పట్ల అవగాహన పెంచుకొని పెంచుకున్నారు.