తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా మంత్రులు ఏడు అంశాలపై సవరణ బిల్లులను ప్రవేశపెట్టారు. విద్యుత్ సవరణ బిల్లుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రాలతో సంప్రదింపులు చేయకుండా, రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే కేంద్రం విద్యుత్ సవరణ బిల్లు తెచ్చిందని మండిపడ్డారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్ర విద్యుత్ బిల్లులో ఉందని అన్నారు. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ప్రయత్నిస్తోందని, విద్యుత్ బిల్లుపై బీజేపీ అసత్యాలు చెబుతోందని ఆరోపించారు.
ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ లేకుంటే కనెక్షన్ కట్ చేయాలని విద్యుత్ బిల్లులో ఉందని పేర్కొన్నారు. విద్యుత్ బిల్లును అమలు చేస్తేనే ఎఫ్ఆరీ బీఎం పరిధి పెంచుతామని కేంద్రం చెబుతోందని తన ప్రసంగంలో కేసీఆర్ తెలిపారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదని, ఇష్టం వచ్చినట్లు చట్టాలు చేస్తోందని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం మాత్రం తెలంగాణలో ఎన్నో విద్యుత్ సంస్కరణ తెచ్చిందని పేర్కొన్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని, దేశంలో ఇతర రాష్ట్రం ఈ జాబితాలో లేదని అన్నారు. రాష్ట్రాలు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నామనేది ప్రగతి సూచికలో ముఖ్యమైందన్నారు.
ఉమ్మడి ఏపీలో విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, అనేక ప్రాంతాల్లో విద్యుత్ షాకులతో చనిపోయారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. విద్యుత్ రంగంతో సహా అనేక సమస్యలపై పోరాడి తెలంగాణను సాధించుకున్నామని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుందని, ఈ క్రమంలోనే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సింగరేణి కాలరీస్ లో రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు కల్పించారన్నారు. అలాగే సీలేర్ పవర్ ప్రాజెక్ట్ ను రాష్ట్రానికి కేటాయించారని అన్నారు. కానీ మోదీ అధికారంలోకి వచ్చాక… తన మొదటి కేబినెట్ సమావేశంలోనే రాష్ట్ర మండలాలను లాక్కున్నారని ఫైర్ అయ్యారు.
లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్న విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పేందుకు కేంద్ర కుట్రలు పన్నుతోందన్నారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం 20 లక్షల మంది తమ ఉద్యోగులను కోల్పోతారని చెప్పారు. విభజన చట్టంలో తమకు రావాల్సిన 40 వేల మెగా వాట్ల విద్యుత్ ను ఇవ్వాలని సీఎం కేసీఆర్ కోరారు.