భారీ వర్షాలతో గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్తగూడెం, ములుగు సహా గోదావరి పరివాహక ప్రాంతంలోని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అధికారులను సన్నద్ధంగా ఉంచాలన్నారు. సచివాలయంలో తక్షణమే కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతున్నది. ఆదివారం ఉదయం 8 గం టలకు 31.5 అడుగులు ఉన్న నీటిమట్టం సాయంత్రం 6 గంటలకు 36.1 అడుగులకు చేరుకున్నది.కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద 9.12 మీటర్ల ఎత్తులో 5.5 లక్షల క్యూసెక్కు లుగా ప్రవహిస్తున్నది. భద్రాచలం వద్ద సోమవారం ఉదయానికి మొదటి ప్రమాద హెచ్చరిక చేరుకోవచ్చని కేంద్ర జల వనరుల సంఘం అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూలై నెలలో ఒకసారి, ఆగస్టు నెలలో ఒకసారి గోదావరికి వరదలు వచ్చాయి. తాజాగా మరోమారు భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తడంతో లోతట్టు కాలనీ వాసులు, ముంపు వాసులు ఆందోళన చెందుతున్నారు.