హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ విచ్చేశారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నిర్వాహకులతో కలిసి నగరంలో పర్యటించారు. ఆ తర్వాత ఎంజే మార్కెట్ లో ఏర్పాటు చేసిన స్టేజీపై ప్రసంగించారు. అసోం సీఎం ప్రసంగిస్తుండగా… టీఆర్ఎస్ నేత నందుబిలాల్ దౌర్జన్యం చేశారు. హిమంత విశ్వశర్మ మైక్ లాక్కోడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా సీఎంతోనే వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఉత్సవ సమితి సభ్యులు… వెంటనే నందు బిలాల్ ను స్టేజీ కిందికి దించేశారు. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

 

ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. అసోం సీఎంను మాట్లాడనీయకుండా టీఆర్ఎస్ నేత మైక్ లాక్కోవడం హేయమని మండిపడ్డారు. గణేశ్ నిమజ్జనోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన సీఎంను గౌరవించాలన్న మర్యాద కూడా టీఆర్ఎస్ కు లేదని దుయ్యబట్టారు. అతి తక్కువ కాలంలో అసోంను డెవలప్ చేస్తున్న సీఎం హిమంత అని అన్నారు. స్టేజీ పైన సీఎం వుండగా… గులాబీ కండువా వేసుకున్న నేతను పోలీసులు స్టేజీ పైకి ఎలా రానిచ్చారని, ప్రోటోకాల్ పాటించరా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఓ సీఎంకు కల్పించే భద్రత ఇదేనా? అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లిన సమయంలో భద్రత కల్పించకుంటే.. ఆయన పర్యటిస్తారా? అంటూ ప్రశ్నించారు.