ఓఆర్ఆర్‌పై సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ ఏర్పాటుకు నానక్ రామ్‌గూడ వద్ద రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం శుంకుస్థాపన చేశారు. మొదటి దశలో 23 కిలోమీటర్ల మేర 4.5 మీటర్ల వెడెల్పుతో సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ను.. 16 మెగావాట్లతో విద్యుత్ ఉత్పత్తి చేసేలా ఏర్పాటు చేస్తారు. 2023 వేసవి నాటికి అందుబాటులోకి తేవాలని హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ లక్ష్యంగా పెట్టుకున్నది. నానక్ రామ్‌గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8.50 కిలోమీటర్లు, నార్సింగి నుంచి కొల్లూరు 14.5 కిలోమీటర్ల వరకు సైకిల్‌ ట్రాక్‌ నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. పర్యావరణానికి అనుకూలంగా ఉండే.. ప్రజాఉపయోగమైన నాన్‌ మోటరైజ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సెల్యూషన్స్‌ను ఉద్దేశంతో ట్రాక్‌ను శంకుస్థాపన చేశామన్నారు.

 

హైదరాబాద్కు సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ మరో మణిహారం అని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ హితమైన, ప్రజా ఉపయోగకరమైన నాన్ మోటరైజ్ట్ ట్రాన్స్ పోర్టు సొల్యూషన్ను ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. దేశంలోనే ఇది మొట్టమొదటి సోలార్ రూఫ్ సైకిలింగ్ ట్రాక్ అని చెప్పారు. స్థానికంగా ఉండే వ్యక్తులు ఆఫీస్కు సైకిల్పై వేళ్లేందుకు ఉపయోగపడాలని ముఖ్య ఉద్దేశంతో సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దుబాయ్, జర్మనీ లాంటి విదేశాల్లో ప్రత్యేకంగా అధ్యయనం చేసి సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.