ఓ వైపు అప్పుల భారం, మరోవైపు పెరుగుతున్న డీజీల్ ధరలతో ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్ధకమైంది. నష్టాల్లో ఉన్న టీఎస్‌ఆర్‌టీసీని గాడిలో పెట్టేందుకు సంస్థ ఎండీ సజ్జనార్ ఎన్నో సంస్కరణలు అమల్లోకి తెచ్చారు. దీంతో ఇప్పటికే పలు డిపోలు లాభాల్లోకి వచ్చాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మిగిలిన డిపోలనూ లాభాల్లోకి తీసుకురావాలన్న లక్ష్యతో మరిన్ని సంస్కరణల అమలుకు సజ్జనార్ సిద్ధమవుతున్నారు. టీఎస్‌ఆర్‌టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకొన్న సజ్జనార్ ఇప్పటి వరకు తీసుకొచ్చిన ఇకపై తీసుకురానున్న కీలక సంస్కరణల వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని 44 పిన్‌కోడ్‌లలో కార్గో డోర్ డెలివరీ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఆర్టీసీలో ఐ టిమ్స్‌ను ప్రవేశపెట్టి డిజిటల్ చెల్లింపులకు వీలు కల్పించారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం 60 రోజుల్లో 108 స్లీపర్ బస్సులను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. త్వరలో 300 ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించనున్నారు.
అన్ని డిపోలు, బస్ స్టేషన్‌న్లలో ఎమ్మార్పీ ధరలకే వస్తువుల విక్రయాలు జరిగేలా చర్యలు చేపట్టారు. వివాహాలు, ఇతర శుభకార్యాలకు ఆన్‌లైన్ ద్వారా బస్సులను కాంట్రాక్టుకు తీసుకొనే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. తిపరుపతికి ప్రత్యేక బస్సులు నడపడంతో పాటు రోజు వెయ్యి మందికి దర్శన టికెట్లను అందజేస్తున్నారు. రాఖీ పండుగ నాడు ఆర్టీసీకి రూ.20.10 కోట్ల ఆదాయం లభించేలా ప్రణాళిక వేసి, విజయవంతంగా అమలు చేశారు. 600 బస్సుల్లో ఆన్‌లైన్ ట్రాకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సుల్లో ఈ వ్యవస్థను అమల్లోకి తీసుకువరానున్నారు. ఆర్టీసీ బస్సుల సమాచారాన్ని తెలియజేసేందుకు 040`69440000, 040`23450033 నంబర్లతో నిరంతరం పనిచేసే కాల్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చారు.