హైదరాబాద్ స్టేట్ భారత యూనియన్‌లో కలిసిన సెప్టెంబర్ 17వ తేదీని ‘తెలంగాణ జాతీయ సమైక్యతాదినంగా పాటించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకొన్నది. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామ క్రమం 2022 సెప్టెంబర్ 17 నాటికి 75వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఏడాదిపాటు ‘తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది. ప్రారంభ వేడుకలను ఈ నెల 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ముగింపు వేడుకలను 2023 సెప్టెంబర్ 16,17,18 తేదీలలో మూడురోజులపాటు నిర్వహిస్తారు.