మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా కన్నప్ప. ఈ సినిమా తాలూకు కీలక షెడ్యూల్ ఇప్పటికే న్యూజిలాండ్ లో జరిగిన విషయం తెలిసిందే. కన్నప్ప సినిమాను భారీ బడ్జెట్తో ఎపిక్ క్యాస్టింగ్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా, నయనతార పార్వతిగా కనిపిస్తారని ముందు నుంచి ప్రచారం జరిగింది.
కానీ తాజా సమాచారం ప్రకారం, కన్నప్పలో ప్రభాస్ క్యారెక్టర్ లో మార్పులు జరిగాయని తెలుస్తోంది. కన్నప్పలో ప్రభాస్ శివుడి వాహనమైన నందీశ్వరుడిగా నటిస్తాడట. ఈ నేపథ్యంలో శివుడి పాత్ర కోసం అక్షయ్ కుమార్ ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ మై గాడ్2 లో ఇలాంటి పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్న అక్షయ్ కుమార్ కూడా ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడట.
కల్కిలో శ్రీ విష్ణువు అంశం తో కూడిన భైరవగా చేస్తున్న తరుణంలో మళ్లీ కన్నప్పలో మహాశివుడిగా అంటే ఇబ్బందవుతుందని ప్రభాస్ క్యారెక్టర్లో మార్పు కోసం రిక్వెస్ట్ చేశాడట. దీంతో డైరెక్టర్ ముకేష్ కుమార్ ఆ మేరకు స్క్రిప్ట్ లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రభాస్ కు సంబంధించిన షూటింగ్ ను ప్లాన్ చేయబోతున్నారు. ప్రస్తుతం కల్కి సినిమా పనుల్లో బిజీగా ఉన్న ప్రభాస్, రాజా సాబ్ షూటింగ్ కు వెళ్లే ముందు కన్నప్ప షూటింగ్ లో పాల్గొనే ఛాన్సుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే శివరాత్రికి కన్నప్పను రిలీజ్ చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.