దాదాపు రెండు దశాబ్దాలకు పైగా సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమం నిరాటంకంగా జరుగుతుంది. ఈసారి కూడా అదే విధంగా సంతోషం పత్రిక అధినేత, నిర్మాత సురేష్ కొండేటి ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో సురేష్ కొండేటి అంటే తలలో నాలుకలా ఉంటారన్న పేరు ఉండనే ఉంది. ఎందుకంటే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి జర్నలిస్టుగా మారి ఆ తరువాత డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా, సంతోషం పత్రిక అధినేతగా, నటుడుగా తనదైన ముద్ర వేసి ముందుకు దూసుకు వెళుతున్నారు. హీరో నాగార్జున సంతోషం సినిమా డిస్ట్రిబ్యూట్ చేసి తద్వారా సంతోషం పత్రిక మొదలు పెట్టిన సురేష్ కొండేటి నాగార్జున సలహా మేరకు అవార్డులు కూడా ప్రధానం చేయడం మొదలు పెట్టారు.
ఇక అలా తెలుగు సినిమాలకు గత 21 ఏళ్లకుగా అవార్డులు అందించిన ‘సంతోషం’ వారపత్రిక ఆధ్వర్యంలో 22వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2023 వేడుకలు ఈ ఏడాది గోవాలో గ్రాండ్ గా జరగనున్నాయి. ఇక ఈమేరకు గోవా ముఖ్యమంత్రితో కూడా సురేష్ కొండేటి భేటీ అయి గోవాలో ఎలా గ్రాండ్ గా జరపాలనే అంశాల గురించి ఇరువురు చర్చించుకోవడం జరిగింది. అక్కడి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇక సంతోషం అధినేత సురేష్ కొండేటి ఈ ఏడాది జరగబోయే ఫంక్షన్ కు సంబంధించిన డేట్ త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ వేడుకల్లోనే ఓటీటీ అవార్డులు కూడా ప్రధానం చేయనున్నారు. సురేష్ కొండేటి గత కొన్నేళ్లుగా సౌత్ ఇండియా లోని నాలుగు భాషల సినిమాలకు అవార్డులు అందిస్తూ వస్తున్నారు. మరికొద్ది రోజుల్లో జరగబోయే ఈ అవార్డు వేడుకల్లో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ బాషల సినిమాలకు అవార్డులు అందచేయనున్నారు.