తెలంగాణ రాష్ట్ర నూనత సచివాలయం నేడే ప్రారంభం కానుంది. దీంతో తెలంగాణ పరిపాలన విభాగంలో కొత్త శకానికి నాంది ప్రస్తావన కానుంది. అంబేద్కర్ పేరు పెట్టిన నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభించనున్నారు. తర్వాత సీఎంతో పాటు మంత్రులు తమకు కేటాయించిన చాంబర్లలో ఆసీనులై… కొత్త సెక్రెటేరియట్ నుంచి తొలి సంతకాలు కూడా చేయనున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడతారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతున్నది. అన్నిరకాల సంప్రదాయాలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి దంపతులు సుదర్శన యాగం , చండీ హోమాల్లో పాల్గొన్నారు. ఉదయం 5.50 గంటలకే రుత్విక్కులు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. ఉదయం 6.15 గంటలకు సచివాలయానికి చేరుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి దంపతులు యాగశాలకు హాజరై చండీయాగం, సుదర్శన యాగాల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడే జరిగే వాస్తు పూజలో కూడా మంత్రి ప్రశాంత్‌రెడ్డి దంపతులు పాల్గొననున్నారు. హోమం, యాగ నిర్వహణ, సచివాలయంలో వివిధ చాంబర్ల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో 110 మంది వేదపండితులు, రుత్విక్కులు పాల్లొంటున్నారు.
ఉదయం సచివాలయంలో వాస్తుపూజ, యాగం.
మధ్యాహ్నం ఒంటి గంటకు సచివాలయానికి చేరుకోనున్న సీఎం.
మధ్యాహ్నం 1:20 నుంచి 1:32 గంటల మధ్య శిలాఫలకం ఆవిష్కరణ. అనంతరం యాగం పూర్ణాహుతి నిర్వహించి సీఎం చాంబర్‌లోని తన సీటులో ఆసీనులై సంతకం చేస్తారు.
మధ్యాహ్నం 1:58 నుంచి 2:04 గంటల మధ్య మంత్రులు, అధికారులు తమతమ సీట్లలో ఆసీనులై సంతకాలు చేస్తారు.
2:15 గంటలకు అధికారులు, సిబ్బంది సభా ప్రాంగణానికి చేరుకొంటారు.
2:15 నుంచి 2:45 గంటల మధ్య అధికారులు, ఉద్యోగులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు.
2:45 గంటల నుంచి భోజనాలు ఉంటాయి.