వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందకుపైగా సీట్లు సాధిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్లీనరీలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లీనరీకి హాజరైన ప్రతినిధులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో 100కుపైగా సీట్లు గెలుస్తాం. నియోజకవర్గం వారీగా ప్రభుత్వం నుంచి కూడా ఇద్దరు నాయకులు బాధ్యతలు తీసుకోవాలి. పల్లెనిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలి. కరెంటు, రోడ్లు, ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, పశుసంపద, మత్స్య సంపద ఇలా ప్రతీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశమే ఆశ్చర్యపోయే ప్రగతిని నమోదు చేసింది.” అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రగతిని చూసేందుకు మహారాష్ట్ర వాళ్లు వచ్చి చూసిపోతున్నారని, క్యాడర్‌లో అసంతృప్త్తిని తగ్గించే చర్యలు చేపట్టాలని కేసీఆర్ సూచించారు . ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, ప్రజలతో కమ్యూనికేషన్స్ పెంచుకోవడం, నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణను చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్ కాదు. మునపటి కన్నా ఎక్కువ సీట్లు రావాలి అనేది ప్రాధాన్యతాంశం అని తేల్చి చెప్పారు. ఎలక్షన్ షుడ్ బీ నాట్ బై చాన్స్.. బట్ బై చాయిస్. దాహం వేసినప్పుడు బావి తవ్వుతామనే రాజకీయం నేటి కాలానికి సరిపోదని కేడర్ కి హితవు పలికారు. తప్పక విజయం సాధిస్తామని, బీఆర్ఎస్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడానికి టీవీ యాడ్స్, ఫిల్మ్ ప్రొడక్షన్ కూడా మన పార్టీ నుంచి భవిష్యత్తులో చేపట్టవచ్చు. అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానల్‌ను సైతం నడపొచ్చు’ అని సీఎం సూచించారు.