గ్రేటర్ హైదరాబాద్ లో మంగళవారం భారీ వర్షం పడింది. రికార్డు స్థాయిలోనే వర్షపాతం నమోదైంది. కేవలం 2 గంటల వ్యవధిలోనే సుమారు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షంతో పాటు గాలులు కూడా వేగంగా వీయడంతో పలు చోట్ల చెట్ల కొమ్మలు, హోర్డింగులు విరి విద్యుత్ తీగలపై పడిపోయాయి. జీడిమెట్ల, సురారం, బాలానగర్, కూకట్ పల్లితో సహా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు వడగండ్ల వాన కురిసింది. ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, దిల్షుక్ నగర్, మలక్ పేట, చార్మినార్ ప్రాంతాల్లో వడగండ్ల వాన పడింది. నగర శివారు ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది.
ఈ నేపథ్యంలో సిటీకి రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. మరో నాలుగు రోజుల పాటు వర్షాభావ పరిస్థితులే వుంటాయని ప్రకటించింది. వడగండ్ల వానలు పడొచ్చని కూడా హెచ్చరించారు. ప్రజలందరూ అప్రమత్తంగా వుండాలని సూచించారు. మరోవైపు సిటీలో భారీ వర్షం కారణంగా జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఇప్పటికీ పలు ప్రాంతాలు ఇంకా నీటిలోనే వుండిపోయాయి.