సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేసే ఆలోచన కేంద్రానికి లేదని బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పునరుద్ఘాటించారు. రామగుండం వేదికగా ప్రధాని మోదీయే చెప్పారని ఆయన గుర్తు చేశారు. సింగరేణి విధి విధానాలపై కేంద్రం జోక్యం చేసుకోవడం లేదని, రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేసిందన్నారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తున్నామని బీఆర్ఎస్ పదే పదే ప్రకటిస్తోందని, దీనిపై చర్చకు తాము సిద్ధమేనని ఈటల సవాల్ విసిరారు. తేదీ, సమయం చెబితే… చర్చకు వస్తామని ప్రకటించారు.

 

బొగ్గు గనులకు దరఖాస్తే చేసుకోకుండా బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని, సింగరేణిపై తెలంగాణ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో 3 గనులు ప్రైవేట్ కి ఇచ్చి, తవ్విస్తున్న మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. విశాఖ గురించి పదే పదే ఆలోచిస్తున్న కేసీఆర్ ముందు రాష్ట్రానికి న్యాయం చేయాలని దెప్పిపొడిచారు. ఆర్టీసీ, నిజాం షుగర్స్, ఆజంజాహి మిల్లు తెలంగాణవి కావా? అని మండిపడ్డారు. కేసీఆర్ సర్కారు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సింగరేణి ప్రైవేట్ పరం చేస్తున్నారన్న తప్పుడు ప్రచారాన్ని భుజానికెత్తుకుందని ఈటల రాజేందర్ మండిపడ్డారు.