నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ అంశంపై సీఎం జగన్ విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలపై సమీక్షించామని, త్వరలోనే బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామని, ఇందుకోసం ఇతర రాష్ట్రాలలోని అంశాలను కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
మరోవైపు… విద్యార్థులకు రాగిజావ నిలిపేశామని కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అదంతా అబద్ధమని స్పష్ట చేశారు. పరీక్షలు, ఒంటిపూట బడుల వల్లే చిక్కీలు ఇస్తున్నామని మంత్రి బొత్స వివరణ ఇచ్చారు. ఇక… విశాఖ పరిపాలన రాజధాని అనేది తమ పాలసీ అని పునరుద్ఘాటించారు. ఇక… విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కొందరు బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని మండిపడ్డారు. బిడ్డింగ్ విషయంతో అదీ రూఢీ అయ్యిందని పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తమ వైసీపీ సర్కార్ క్లియర్ గా వుందని, తాము ప్రైవేటీకరణకు వ్యతిరేకమని బొత్స ప్రకటించారు.