కల్వకుంట్ల కుటుంబం సహా బీఆర్ఎస్ నేతల మితిమీరిన జోక్యం కారణంగా సింగరేణి వ్యవస్థ అస్తవ్యస్తమైపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి సంరక్షణ నినాదమిచ్చిన కల్వకుంట్ల కుటుంబం ఇప్పుడు సంరక్షణ లేకపోగా సింగరేణి నిధుల భక్షణ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు రూ.3,500 కోట్ల మిగులు నిధులతో ఉన్న సింగరేణి 2023 జనవరి వరకు రూ.10వేల కోట్ల అప్పుల్లోకి కూరుకుపోవడానికి కారణాలేంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి మిగులు నిధులతో బంగారు గనిలా పేరు తెచ్చుకున్న సింగరేణి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టేసిందని విమర్శించారు.ఈ తొమ్మిదేళ్లలో సింగరేణిలో వచ్చిన మార్పులపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం వాటా 49 శాతం ఉన్నప్పటికీ.. 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే మొత్తం అడ్మినిస్ట్రేషన్ ఉంటుందని పేర్కొన్నారు. ఓవైపు సింగరేణి టర్నోవర్ పెరుగుతున్నా లాభాలు పెరగకపోవడానికి గల కారణాలేంటో కూడా చెప్పాలని నిలదీశారు.
సింగరేణి బీఆర్ఎస్ నాయకుల జేబు సంస్థగా మారిపోయిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణి అధికారులు ఇవాళ చిన్న పనికి కూడా ఎమ్మెల్యేల ఇంటికెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. చివరకు కార్మికుల డ్యూటీ షిఫ్టింగ్ మార్చాలన్నా అధికార పార్టీ నాయకుల జోక్యం ఎక్కువైందన్నారు. సింగరేణి పరిపాలన పూర్తిగా కుప్పకూలే పరిస్థితి ఏర్పడిందని.. ఈ సాకుతోనే బీఆర్ఎస్ నాయకులు ప్రైవేటీకరణ అని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో బొగ్గు గనుల వేలంలో ప్రభుత్వం పాల్గొనట్లేదని విమర్శించారు. టెండర్లు కూడా వేయకుండా బాధ్యత విస్మరించారని మండిపడ్డారు. సింగరేణి ఎన్నికల దృష్ట్యా కొత్త పల్లవి అందుకున్నారని.. ప్రధానికి వ్యతిరేకంగా దీక్షలు చేయాలని పిలుపునిచ్చారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటామని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతోందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. విశాఖ కార్మికుల పాలిట దేవుళ్లమని గొప్పలు చెబుతున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం రాజకీయ జిమ్మిక్కులు చేస్తోందని విమర్శించారు. సింగరేణి సొమ్మును.. విశాఖ స్టీల్‌లో పెడితే కార్మికులు ఊరుకోరని హెచ్చరించారు. మరోవైపు, సింగరేణిలో పర్మినెంట్ ఉద్యోగులు తగ్గిపోతున్నారని.. ఆ ఖాళీలను భర్తీ చేయడం లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. సింగరేణిని అప్పుల్లోకి నెట్టేరని ధ్వజమెత్తారు.