మాదక ద్రవ్యాలు సరఫరా అంటేనే వణికిపోవాలి… అలా చేయండి: అమిత్ షా

మాదక ద్రవ్యాలను దేశం నుంచి తరిమేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో చాలా కఠినంగా వుంటూ… ఆ దిశగానే అడుగులు వేయాలన్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల నిరోధక సంస్థల అధిపతులతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇలా ఈ అధికారులతో భేటీ కావడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వారు దేశద్రోహులని, యువత జీవితాలతో చెలగాటాలు ఆడుకుంటున్నారని విరుచుకుపడ్డారు.

 

మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వారిని ఎంత మాత్రమూ ఉపేక్షించవద్దని, కొత్తగా వీటిని సరఫరా చేయాలనుకునే వారికి దెబ్బకు వణికిపోయేలా చర్యలు వుండాలని అమిత్ షా అధికారులకు సూచించారు. అయితే… మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాటంలో దేశ ప్రజలను కూడా భాగస్వామ్యం చేసుకోవాలని, దీనిని కేవలం ప్రభుత్వానికి మాత్రమే పరిమితం చేయవద్దననారు.

అయితే… మాదక ద్రవ్యాల కేసులు నమోదు చేసే విషయంలో ఆ సమాచారాన్ని ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలతోనూ పంచుకోవాలని తెలిపారు. మాదక ద్రవ్యాల సరఫరా, వీటిని నిల్వచేయడం లాంటి విషయాల్లో ఆర్థిక కోణమూ వుంటుందని, అంతేకాకుండా ఉగ్రకోణం కూడా వుంటుందని వివరించారు. ఈ నేపథ్యంలోనే ఆ సమాచారాన్ని ఎన్ఐఏ, ఈడీతో కూడా పంచుకోవాలని తెలిపారు. గత 9 ఏళ్ల పాలనలో మాదక ద్రవ్యాల సరఫరాదారులపై 181 శాతం అధికంగా కేసులు నమోదయ్యాయని అమిత్ షా తెలిపారు.

Related Posts

Latest News Updates