స్వలింగ సంపర్కుల వివాహాల విషయంలో కేంద్రం కీలక వ్యాఖ్య చేసింది. ఈ విషయంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభిప్రాయాన్ని తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంను అభ్యర్థించింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై వ్యాఖ్యలు, అభిప్రాయాలను తెలియజేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే విషయమై ప్రస్తుతం సుప్రీంలో వాదనలు జరుగుతున్నాయి. స్వలింగ వివాహాలపై చర్చ రాష్ట్రాల శాసనసభ పరిధిలోకి వస్తుందని, అందుకే విచారణలో భాగం కావాలని కేంద్రం తన వాదన వినిపించింది. దీనిపై 10 రోజుల్లోగా తమ అభిప్రాయాలు వెల్లడించాలని రాష్ట్రాలకు లేఖలు రాసింది.
వివిధ ప్రాంతాల్లోని వివిధ వర్గాల్లో అనుసరిస్తున్న ఆచారాలు, సంప్రదాయాలను గమనించాల్సి వుంటుందని, ఓ తీర్పు కోసం అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కోర్టు ఎదుట వుంచడం ఆవశ్యకమని కేంద్రం పేర్కొంది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఎస్ఆర్ భట్, జస్టిస్ హిమ కొహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది.
మంగళవారం ప్రారంభమైన ఈ విచారణ బుధవారం కూడా కొనసాగింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ, స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు భాగస్వామ్యం ఇవ్వాలని కోరారు. అలాకాని పక్షంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సంప్రదింపులు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని కోరారు.