సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన ఇప్పటికే క్యాంప్ కార్యాలయం నుంచి శ్రీకాకుళం జిల్లా మూలపేట పర్యటనకు బయల్దేరారు. తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గంలో విమానాశ్రయం చేరుకున్న సీఎం ప్రత్యేక విమానంలో విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లాకు చేరుకుని మూలపేట పోర్టు నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొననున్నారు.
గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు నిర్వహించి… ఆపై నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్‌కు, హిర మండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు శంకుస్ధాపన చేస్తారు. బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలతో ముఖాముఖి, సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి తిరిగి తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకోనున్నారు.
శ్రీకాకుళం సమగ్రంగా డెవలప్ కావడానికి సంతబొమ్మాళి మండలంలో 4,362 కోట్ల వ్యయంతో మూలపేట పోర్టు పనులకు సీఎం భూమిపూజ చేస్తారు. 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తులను నిర్మించనున్నారు. జనరల్ కార్గొ, బొగ్గు, కంటైనర్ తో పాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వినియోగించేలా 30 నెలల్లో ఈ పోర్టును పూర్తి చేయాలని నిర్ణయించారు. మూల పేట పోర్టు అందుబాటులోకి వస్తే ఏపీతో పాటు ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా నుంచి ఎగుమతులు, దిగుమతులకు అత్యంత కీలకంగా మారుతుంది. ఈ పోర్టు ద్వారా 25 వేల మందికి ఉపాధి లభించనుంది.